33 వారాల గర్భం తొలగింపునకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టు

 33 వారాల గర్భం తొలగింపునకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: అబార్షన్ చేయించుకోవాల్నా? వద్దా? అనే విషయంలో గర్భం దాల్చిన మహిళదే తుది నిర్ణయమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పిండంలో మెదడు ఎదుగుదల సరిగ్గా లేని కారణంగా 33 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం.. గర్భం 24 వారాలు దాటితే అబార్షన్ చేయడంపై నిషేధం ఉంది. అందుకే 33 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ పూజా కుమారి అనే 26 ఏండ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీలోని ఎల్ఎన్ జేపీ హాస్పిటల్ తిరస్కరించింది. దీంతో ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అబార్షన్ కు అనుమతినిస్తూ మంగళవారం కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అంశం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చకు వస్తుంటుంది. అయితే, ఇండియన్ చట్టాల ప్రకారం అబార్షన్ విషయంలో తల్లి నిర్ణయమే అంతిమమని కోర్టు అభిప్రాయానికి వచ్చింది. అందుకే ఈ కేసులో మెడికల్ టర్మినేషన్ కు అనుమతి ఇస్తోంది. పిటిషనర్ వెంటనే అబార్షన్ చేయించుకోవచ్చు” అని హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 

బిడ్డ లోపాలతో పుట్టే అవకాశం ఉందని.. 

‘‘ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బిడ్డ లోపాలతో పుట్టే అవకాశం ఉందని ముందే గుర్తించొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత ఎదుర్కొనే వైకల్యం, బిడ్డతో పాటు తల్లిదండ్రులపై పడే ఆర్థిక, సామాజిక ప్రభావాన్ని బట్టి మెడికల్ టర్మినేషన్​ను అనుమతించొచ్చు” అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదని తేలినందున, అబార్షన్ వల్ల ఎదురయ్యే రిస్క్ భరించేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నందున అబార్షన్​కు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.