ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 600 పేజీల సాకుతో మరోసారి గడువు కోరొద్దు : హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  600 పేజీల సాకుతో మరోసారి గడువు కోరొద్దు : హైకోర్టు
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఈడీ పిటిషన్​పై నిందితులకు హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ట్రయల్​ కోర్టు స్పెషల్ జడ్జి తన పరిధిని దాటారా?  లేదా? అనేది తేల్చాల్సిన బాధ్యత తమపై ఉందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలంటూ ఈడీ హైకోర్టులో పిటిషన్​ వేసింది. దీనిపై గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ తరఫున ఏఎస్జీ ఎస్వీ.రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపించారు. 

సీబీఐ కేసుతో ఈడీకి సంబంధం లేనప్పటికీ న్యాయమూర్తి తమపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఈ విషయంలో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఈడీ దర్యాప్తుపై చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈడీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించలేదని, కనీసం తమ వాదనలు వినే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా, కేవలం ఊహలతో దర్యాప్తు సంస్థలపై చేసిన వ్యాఖ్యల వల్ల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని తెలిపారు. 

కాగా, పిటిషన్​పై స్పందించేందుకు తమకు సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరగా.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంలోనూ 600 పేజీల తీర్పు కాపీ పేరుతో వారం గడువు కోరారని ఆగ్రహించారు. ఇప్పుడు అదే సాకుతో ఈడీ కేసులో సమయం కోరడం సరికాదన్నారు. అయితే, ప్రతివాదుల అభ్యర్థన మేరకు మరింత సమయం ఇస్తూ కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు. మరోసారి గడువు కోరవద్దని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.