ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేడు కవిత బెయిల్ పిటిషన్​పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేడు కవిత బెయిల్ పిటిషన్​పై విచారణ
  •      మరోసారి ములాఖత్ కానున్న కేటీఆర్, హరీశ్​

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై సోమవారం మరోసారి రౌస్ ఎవెన్యూ కోర్టు (ట్రయల్) విచారణ చేపట్టనున్నది. లిక్కర్ స్కామ్​లో కవిత పాత్రపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. అయితే.. ఇదే సందర్భంలో సీబీఐ చార్జ్ షీట్ లో లోపాలు ఉన్నాయని, అసలు ఈ కేసులోనే ఏమీ లేదని ఆరోపిస్తూ కవిత మరోసారి సీబీఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

 ఆ పిటిషన్ పై జులై 22న విచారించిన స్పెషల్​ జడ్జి కావేరి బవేజా.. కేసును నేటికి (ఆగస్టు 5) వాయిదా వేశారు. దీంతో ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనున్నది. కాగా, లిక్కర్ స్కామ్​ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించాయి.  

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత

తిహార్ జైలులో ఉన్న కవితను సోమవారం ఆమె సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యుడు హరీశ్ రావు కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత జులై 22న హుటాహుటిన ఢిల్లీ వచ్చిన కేటీఆర్.. కవితతో ములాఖత్ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆమెతో ముచ్చటించి, అరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు, తదితర వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుత సందర్భంలో బెయిల్ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించామని, తప్పకుండా బెయిల్ వస్తుందని ఆమెకు ధైర్యం చెప్పారు. కాగా, కవితతో ములాఖత్ కోసం శనివారం రాత్రి కేటీఆర్ ఢిల్లీ వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.