మహమ్మద్ జుబేర్ కు 4 రోజుల రిమాండ్

మహమ్మద్ జుబేర్ కు 4 రోజుల రిమాండ్

న్యూఢిల్లీ : ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ స‌హ వ్యవస్థాప‌కుడు, జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ కు ఢిల్లీ పోలీసులు 4 రోజుల రిమాండ్ విధించారు. ఒకరోజు కస్టడీ విచారణ గడువు ముగిసిన తర్వాత చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (పాటియాలా హౌస్ కోర్టు) ముందు హాజరుపరిచారు. ఒక వర్గం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు, శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం(జూన్ 27న) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జుబేర్ పై సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. 

 

2018లో చేసిన ఓ ట్వీట్ చేసిన కేసులో జుబేర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవ‌ల నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్యల‌ను కూడా ముందుగా ట్వీట్ చేసింది ఈయనే. జుబేర్ రెచ్చగొట్టే ట్వీట్స్ చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసులు త‌మ ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేశారు. ప్రజ‌ల్లో ద్వేష‌భావాన్ని పెంచేలా జుబేర్ ట్వీట్లు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. 

2018లో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. దాని కోసం ఓ సినిమా క్లిప్‌ను కూడా వాడారు. ఈ కేసులో జుబేర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వచ్చాయి. మ‌త‌ప‌ర‌మైన భావాల‌ను కించ‌ప‌రిచిన‌ట్లు కేసు నమోదైంది. ఈ నేప‌థ్యంలోనే పోలీసు క‌స్టడీలోకి తీసుకున్నారు. మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను కావాల‌నే దెబ్బతీయాల‌న్న క‌క్ష్యతో సోషల్ మీడియాలో జుబేర్ ఇలాంటి పోస్టులు చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవ‌ల ప్రవ‌క్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల‌ను వ‌క్రీక‌రించి జుబేర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దుమారం రేపిన విష‌యం తెలిసిందే. త‌న వ్యాఖ్యల‌ను జుబేర్ వ‌క్రీక‌రించిన‌ట్లు కూడా నుపుర్ శర్మ ఫిర్యాదు చేసింది. 

జుబేర్ అరెస్ట్ ను ఖండించిన విపక్షాలు


జుబేర్‌ను అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ సీనియర్లు శశిథరూర్‌, జైరాం రమేష్‌లతో పాటు మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. ఓ కేసులో ప్రశ్నించేందుకు పిలిచి.. జుబేర్ ను మరో కేసులో అరెస్ట్‌ చేశారని జుబేర్‌ సహ ఉద్యోగి, ఆల్ట్‌ న్యూస్‌ మరో సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ఆరోపించారు.