న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నిన 9 మంది టెర్రరిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఢిల్లీలో వీరిని అరెస్టు చేశామని, వీరికి ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
అరెస్టయిన వారిలో ఢిల్లీ, ముంబై, పంజాబ్‌కు చెందిన వ్యక్తులతోపాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రముఖ రక్షణ కేంద్రాలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవాలన్న ఆదేశాలతో వీరు దాడులకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠా కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్‌కు సరిహద్దుల అవతల ఉన్న లింకులు, నిధుల రాక, విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై లోతుగా విచారణ జరుగుతోందని చెప్పారు.
కాగా, ఉగ్ర దాడుల ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లాల పోలీసు విభాగాలను అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర పారామిలటరీ దళాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
