రైతుల కోసం పెట్టిన బారికేడ్లను తొలగిస్తున్న పోలీసులు

రైతుల కోసం పెట్టిన బారికేడ్లను తొలగిస్తున్న పోలీసులు

ఢిల్లీ బార్డర్లలో పోలీసులు బారికేడ్లను తొలగిస్తున్నారు. టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలను జేసీబీల సాయంతో తీసేశారు. అన్నదాతలు రోడ్లను బ్లాక్ చేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. పెట్టిన అడ్డంకులను తొలగిస్తున్నారు. రేపట్నుంచి రోడ్లపై ట్రాఫిక్‌ను అనుమతించే అవకాశముంది. అయితే రోడ్లను తాము బ్లాక్ చేయలేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. రోడ్లను బ్లాక్ చేయడం తమ ఆందోళనలో భాగం కాదన్నారు. పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని మోడీ చెప్పారని.. ఇక తాము పార్లమెంట్‌‌కు వెళ్లి పంటలను అమ్ముకుంటామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ముందుగా తమ ట్రాక్టర్లు ఢిల్లీలోకి ఎంటర్ అవుతాయని చెప్పారు.  

కాగా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో అన్నదాతలు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల పలుమార్లు ఢిల్లీలో రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు క్యాంప్ వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల బ్లాకేజీ వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలు, ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ అనే మహిళ సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. రైతుల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలన్న కోర్టు.. వారికి నిరసనలు తెలిపే హక్కుందని స్పష్టం చేసింది. కానీ రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని పేర్కొంది. ఇతర పద్ధతుల్లో నిరసనలను తెలుపుకోవచ్చని.. రోడ్లను బ్లాక్ చేయొద్దని జస్టిస్ ఎస్‌కే కౌల్, ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంపై మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ వేయాలని రైతు సంఘాలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

ఫేస్‎బుక్‎కు కొత్త పేరు ప్రకటించిన జుకర్‎బర్గ్

బాధ్యత లేదా..? జీతం తీసుకుంటలేరా?

ఇది ఎన్నిక కాదు.. ఓట్ల వ్యాపారం