విశ్లేషణ: ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తరా?

విశ్లేషణ: ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తరా?
  • ప్రజాస్వామ్యం బతికేదెలా?

పోలీసులు, ఐఏఎస్​ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇంత బానిసత్వంలోకి కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓటు వేయడం అనేది మన హక్కు. ఇది హక్కే కాదు మన బాధ్యత కూడా. కానీ జనం డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఇక వారికి ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉంటుంది. నాకు ఐదు వేలు ఇస్తే ఓటేస్తా.. పది వేలు ఇస్తే ఓటేస్తా అని ప్రజలు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది. రాజకీయ పార్టీల్లో ఉన్న కార్యకర్తలు కూడా ఇప్పుడు లిక్కర్, బిర్యానీ లేకుంటే ప్రచారానికి రావడం లేదు. డబ్బులిచ్చి, బిర్యానీ పెడితేనే ప్రచారం చేస్తామని వారు అనడం చూస్తే ఒక రకంగా భయం కలుగుతోంది. అసలు ఇదేం డెమొక్రసీ. ఇప్పటికైనా జనం కళ్లు తెరవాలి. ప్రశ్నించే తమ హక్కును అమ్ముకోవడం మానేయాలి.

నేను చదువుకునేటప్పుడు ‘‘బూటకపు ఎన్నికలను బహిష్కరించండి. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది’’ అని నక్సలైట్లు పిలుపునిస్తే, వాళ్లు తప్పుగా ఆలోచిస్తున్నారేమో అన్న భావనకు గురయ్యేవాడిని. కానీ ఇప్పుడు హుజూరాబాద్‌‌‌‌లో పరిస్థితులు చూస్తుంటే వారి సిద్ధాంతాలే సరైనవని అనిపిస్తోంది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి, ముఖ్యంగా హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నిక తీరు చూస్తుంటే అది వ్యభిచారం కంటే హీనమైన ఫక్తు వ్యాపారంగా మారిపోయినట్టు అనిపిస్తోంది.

ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తరా?

ఎన్నికలు రాగానే ప్రజల బాగోగులు గుర్తించినట్లుగా ఇండ్లు కట్టిస్తమని, బడులు కట్టిస్తమని, ఈ బంధు.. ఆ బంధు.. దళిత బంధు అని, కుల భవనాలని, రోడ్లు, వాటర్‌‌‌‌‌‌‌‌ ట్యాంకులని హామీలు గుప్పిస్తున్నరు. ఇవన్నీ బై ఎలక్షన్​ అప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొస్తున్నాయి? ఉప ఎన్నికలో ఓట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఎంత వరకు సరైనది? బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ రెండు పార్టీలు విచ్చలవిడిగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం చూసిన తర్వాత తెలంగాణలో ప్రజాస్వామిక ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇవి కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే నడుస్తున్న ఎన్నికలు. ఇన్ని వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన తర్వాత గెలుపొందినవారెవరైనా సరే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తారనే విషయంపై లోతుగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. జనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి.

ఎందుకీ బానిసత్వం..

ఒక్కొక్కరికీ ఆరు వేల రూపాయలను సీల్డ్‌‌‌‌ కవర్లలో పెట్టి పంచుతుంటే నాకు పంచలేదు.. నాకు పంచలేదని ప్రజలు రోడ్లమీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇంతటి మానసిక దౌర్భల్యానికి గురైన హుజూరాబాద్‌‌‌‌ ఓటర్ల మనస్తత్వాన్ని  చూసినట్లయితే మనం ఎంత అచేతనావస్థలోకి కూరుకుపోతున్నామో అనిపిస్తోంది. ఇలా పాలక వర్గాలు సమాజాన్ని అచేతనావస్థలోకి నెట్టేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో అసలు ఎన్నికల అధికారి ఉన్నరా? లేరా? లేదంటే ఆయన పాలక వర్గానికి తొత్తుగా మారిపోయారా? అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మొత్తుకుంటే ముగ్గురు అధికారులను పంపుతరు. వాళ్లు కూడా ఉన్నరా? లేరా? అన్నది తెల్వదు. రాష్ట్ర ఎన్నికల అధికారి, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు, పోలీసు యంత్రాంగం ఇంతమంది ఉండి కూడా సీల్డ్‌‌‌‌ కవర్లలో డబ్బులు ఎట్ల పంచుతున్నరు? వందలు, వేల కోట్ల రూపాయలు ఎట్ల డిస్ట్రిబ్యూట్‌‌‌‌ అవుతున్నయ్‌‌‌‌. వేల కోట్ల రూపాయల లిక్కర్‌‌‌‌‌‌‌‌ 
ఎలా సప్లయ్‌‌‌‌ అవుతోంది? 
ఎన్నికల సంఘం ఎందుకుంది?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా ఒక ప్రహసనం అయిపోయింది. ఎన్నికల నిర్వహణ కూడా అపహాస్యంగా మారింది. ఎందుకీ తమాషా అంతా? తెలంగాణలో ఎన్నికలొద్దు అర్రాసు పాట పెడితే సరిపోతుంది కదా! ఆప్షన్‌‌‌‌ లో ఎవరెక్కువ పాట పాడితే అతనికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌‌‌‌ డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేయండి. ఎన్నికలెందుకు? ఎన్నికల అధికారులెందుకు? ఎన్నికల సంఘమెందుకు? పోలీసులెందుకు? ప్రజలు డబ్బులు తీసుకుని, మందు మత్తులో లైన్లలో నిలబడి బ్యాలెట్‌‌‌‌లో ఓట్లు ఎందుకు వెయ్యాలె. ఎందుకీ రచ్చంతా..  అర్రాసు పాట పాడితే ఎవరెక్కువకు పాట పాడితే వాడికే అధికారం కట్టబెడితే సరిపోతుంది కదా! ఆక్షన్‌‌‌‌ ద సీట్ రేదర్‌‌‌‌‌‌‌‌ దేన్‌‌‌‌ కండక్టింగ్‌‌‌‌ ద ఎలక్షన్స్‌‌‌‌ వస్తే బాగుంటుంది అని అనిపిస్తోంది. పాట పాడితే వచ్చిన డబ్బులతో కమ్యూనిటీ డెవలప్​మెంట్​ చేయవచ్చు. రోడ్లు, స్కూళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. ఇవాళ ప్రజలకు మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి అవసరాలకు విధి విధానాలను తయారు చేయాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయ వ్యాపారానికి పాల్పడుతున్నారు. అవినీతి సొమ్ము పట్టుకొచ్చి ప్రజలను కూడా అందులో భాగస్వాములుగా మారుస్తున్నారు. అసలు రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి ఎన్నికల సంఘం గుడ్డిగుర్రానికి పండ్లు తోమినట్టుగా వ్యవహరిస్తోంది. అసలు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థా లేదా వ్యాపార వ్యవస్థా?

అందరూ వ్యాపారవేత్తల్లా మారిపోయారు

ఈరోజు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుంటే అందరూ వ్యాపారవేత్తల్లానే ప్రవర్తిస్తున్నారు. రాజకీయం అనేటువంటిది వృత్తి కాదు, ప్రవృత్తిగా మారిపోయింది. కేవలం గన్‌‌‌‌మెన్‌‌‌‌ల నంబర్లు తీసుకోవడానికి మాత్రమే అన్నట్లు ఉంది. డాబు, దర్పం ప్రదర్శించడం కోసం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైరవీలు  చేసుకోవడం కోసమే ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు పొందుతున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఎవరిలోనూ ఉన్నట్టు కనబడటంలేదు. దానికి నిదర్శనమే ఈ హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికలో వందల కోట్లు ఖర్చుపెట్టడం. ఇప్పుడు వందల కోట్లు పెట్టుబడి పెడితే తర్వాత వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేదొక్కటే రీజన్. తాజా పరిస్థితులు చూస్తుంటే పొలిటికల్‌‌‌‌ వాలంటరిజం చచ్చిపోయిందా అనిపిస్తోంది. ఇంతకు ముందు ప్రచారానికి వచ్చే కార్యకర్తలు ఎవరి టిఫిన్‌‌‌‌ బాక్సులు వాళ్లు తెచ్చుకుని, సమాజ సేవే లక్ష్యంగా పని చేసేవారు. అలాంటి సంఘసేవకులు ఈరోజు పెట్టుబడిదారీ రాజకీయ నాయకుల పల్లకీలకు బోయిలుగా మారిపోయారు. మొత్తం సోషల్‌‌‌‌ వర్క్‌‌‌‌ గెటింగ్‌‌‌‌ ఇన్‌‌‌‌ టు పాలిటిక్స్‌‌‌‌ అనే కాన్సెప్ట్​ పోయి కేవలం కాంట్రాక్టర్లు, క్యాప్టలిస్ట్‌‌‌‌లు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్లనే  ఉన్నట్లయితే రానున్న రోజుల్లో ఏ సాధారణ వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు ఉండవు.

ఒకవైపు ఓటుకు రూ.6,000 కవర్​లో పెట్టి మరీ ఇస్తున్న లీడర్లు. ఇంకోవైపు డబ్బులివ్వలేదని రోడ్డెక్కుతున్న జనం. ఇవన్నీ చూస్తుంటే ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని’ అన్న సినిమా పాట గుర్తొస్తోంది. తమ ఓటును అమ్ముకుంటున్న జనం.. ప్రశ్నించే హక్కును కోల్పోతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సరళిని చూస్తే.. ఇంతకన్నా వేలం పాట పెట్టి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటును కట్టబెట్టడం నయమనిపిస్తోంది. అలా వచ్చిన డబ్బుతో అయినా కమ్యూనిటీ డెవలప్​మెంట్​ చేయవచ్చు... దాసోజు శ్రవణ్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి