రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' పేరుతో మార్చి 6 నుంచి 2 జూన్ 99 రోజుల కార్యచరణను అమలుకు ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి శాఖ తమ పరిధిలోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ‘అభయ హస్తం’ పేరుతో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల, ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నవి. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారింది. ప్రతినెల రూ.6,500 వేల కోట్లకు పైగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తోంది. ప్రతి నెల రూ. 6,500 వేల కోట్లకు పైగా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపుకు సరిపోతుంది. రాష్ట్రంలో ప్రతినెల ఆదాయం రూ.15000 కోట్లకు మించటంలేదు. ఖర్చు మాత్రం ప్రతి నెల రూ.18 వేల కోట్లకు చేరుతుందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ సమావేశాల సందర్బంగా తెలిపారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవటానికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలి.
ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవి పీఆర్సీ అమలు, గతంలో పెండింగ్లో ఉన్న 3 డీఏలతోపాటు ఈ సంవత్సర కాలంలో 2 డీఏలు చెల్లించడం, మార్చి 2024 తర్వాత రిటైర్ అయిన 10 వేల మంది ఉద్యోగులకు పెన్షనరీ ప్రయోజనాల చెల్లించాలని రాష్ట్రంలోని 13.31 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. వారి డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ 205 సంఘాలతో కూడిన జేఏసీ ఏర్పాటు అయింది. ఆనాటి నుంచి జేఏసీ నాయకత్వం 57 డిమాండ్లతో కూడినవి (అందులో 12 మాత్రమే ఆర్థికపరమైనవి) ప్రభుత్వం ముందుంచింది.
ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి విజ్ఞాపనలు ఇస్తున్నప్పటికీ, వారి కోరికలను పరిష్కరించకపోగా కాలయాపన చేస్తున్నారని ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి మొదలైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ట్లుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలమైన విధానాన్ని అవలంబించడంతోపాటు, ఆరు నెలలకు ఒకసారి డీఏ చెల్లించడం, ఐదేళ్లకొకసారి పీఆర్సీ అమలుచేయడం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలో ప్రధాన ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో41వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి రిటైర్అయిన ఏడున్నర వేలమంది కార్మికులకు రావలసిన ఎన్క్యాష్మెంట్ కార్మికుడికి రూ. 6 లక్షలు చొప్పున అందించాల్సి ఉంది.
2017లో రిటైర్ అయిన వారికి వేతన సవరణ ప్రకారం బెనిఫిట్స్, 2021 నుంచి నూతన వేతన సవరణ తదితర పెండింగ్ డిమాండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోగా... 2021 సమ్మె తర్వాత కార్మిక సంఘాలపై తీవ్ర నిర్బంధాలు విధించి, సమ్మెల నిషేధంతోపాటు యూనియన్లను నిషేధించింది. ఈ ప్రజా ప్రభుత్వమైనా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ఈనెల 26 నుంచి సమ్మెకు పోవడానికి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ సంఘాలతో కాలయాపన చేయకుండా ప్రభుత్వము చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో 2.5 లక్షలు ఉద్యోగులు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులర్ చేసి, నూతన పీఆర్సీ, కనీస వేతన విధానం అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న అంగన్వాడి, ఆశ, మిడ్ డే మీల్స్, ఐకెపి, వివిధ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఇబ్బంది వేతనాలు పెంచకపోగా ఇచ్చే అతితక్కువ వేతనాలు కూడా మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని వీరంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలతోపాటు సహకార సంస్థల్లో పనిచేస్తున్న 2.5 లక్షలు ఉద్యోగస్తులు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కనీస వేతనాలు రివైజ్ కాలేదు. కనీస వేతనాల బోర్డు రికమండేషన్ చేసిన 5 షెడ్యూల్లో వేతనాలు గెజిట్ నోటిఫికేషన్ చేయట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు రివైజ్ చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపొం దిస్తున్న సందర్భంగా ఉద్యోగ, కార్మికుల ప్రధాన న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
