ఇంటలెక్చువల్‌‌‌‌ టెర్రరిస్టులు మరింత డేంజర్

ఇంటలెక్చువల్‌‌‌‌ టెర్రరిస్టులు మరింత డేంజర్
  • సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసుల వాదన
  • డాక్టర్లు, ఇంజినీర్లు తమ పని చేయడంలేదు.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరు
  • 2020 అల్లర్లకు సంబంధించి ఖాలిద్‌‌‌‌, శర్జీల్‌‌‌‌కు బెయిల్‌‌‌‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: మేధావులు గనుక టెర్రరిస్టులుగా మారితే.. వారు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నవారికంటే మరింత ప్రమాదకరంగా మారుతారని ఢిల్లీ పోలీసులు ఆందోళన వ్యక్తంచేశారు. డాక్టర్లు, ఇంజినీర్లు ఇప్పుడు తమ పనిమాత్రమే చేయడం లేదని, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడడం ఓ ట్రెండ్‌‌‌‌గా మారిందని అన్నారు.  ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి నిర్బంధంలో ఉన్న ఉమర్‌‌‌‌ ఖాలిద్‌‌‌‌, శర్జీల్‌‌‌‌ ఇమామ్‌‌‌‌ తదితరుల బెయిల్‌‌‌‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు.

ఈ కేసులో వారికి బెయిల్‌‌‌‌ ఇవ్వొద్దని జస్టిస్‌‌‌‌ అరవింద్ కుమార్, జస్టిస్‌‌‌‌ ఎన్వీ అంజరియాతో కూడిన బెంచ్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ అమెండ్‌‌‌‌మెంట్‌‌‌‌ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీ)కు వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారగా.. 53 మంది మృతిచెందారు. ఈ అల్లర్లకు సూత్రధారులుగా పేర్కొంటూ ఉమర్‌‌‌‌ ఖాలిద్, శర్జీల్‌‌‌‌ ఇమామ్‌‌‌‌, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్‌‌‌‌ హైదర్, రెహమాన్‌‌‌‌పై ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద కేసులు నమోదు చేసి, నిర్బంధంలో ఉంచారు. 

సీఏఏకు వ్యతిరేకంగా ఇమామ్‌‌‌‌ రెచ్చగొట్టే స్పీచ్ లు

ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్‌‌‌‌ సొలిసిటర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎస్వీ రాజు హాజరై, వాదనలు వినిపించారు. నిందితుల వల్లే ఈ కేసులో జాప్యం జరిగిందని చెప్పారు.  సీఏఏకు వ్యతిరేకంగా ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పేర్కొంటూ.. ఆ వీడియోలను కోర్టులో ప్రదర్శించారు.ఇమామ్‌‌‌‌ ఓ ఇంజినీరింగ్‌‌‌‌ గ్రాడ్యుయేట్​ అని తెలిపారు.‘‘ఇవి సాధారణ నిరసనలు కాదు.. హింసాత్మకంగా మారాయి. వారు కేవలం దిగ్బంధనాల గురించే మాట్లాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను కూడా ఇంటర్నేషనల్‌‌‌‌ కవరేజీ కోసం వాడుకున్నారు.

 ఆందోళనల మాటున ప్రభుత్వాన్ని చేంజ్‌‌‌‌ చేయాలని కుట్ర పన్నారు. ఆర్థిక విధ్వంసం,  దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించడమే లక్ష్యంగా నిరసనలు చేపట్టారు” అని వివరించారు.  ఇవి ఆకస్మికంగా జరిగినవి కాదని, దేశ సార్వభౌమత్వంపై ఓ ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని మంగళవారం వాదనల సందర్భంగా కోర్టులో పోలీసులు వాదించారు.  నిర్బంధంలో ఉన్నవారికి బెయిల్‌‌‌‌ ఇవ్వొద్దని కోరారు.