ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు

ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కేపురంలో గల ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కూల్​లో రెండు బాంబులు పెట్టినట్టు పాఠశాలకు ఈ మెయిల్​ చేశారు. దీంతో స్కూల్​ మేనేజ్​మెంట్​వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్​కు చేరుకొని స్టూడెంట్లను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిటెక్షన్​ టీం,  డాగ్ స్క్వాడ్ ను పిలిపించి స్కూల్​తో పాటు హాస్టల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. 

అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఈ మెయిల్ ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఆర్కే పురంలోని లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్ ఆవరణలో బాంబు ఉందంటూ ఒక ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత అది ఫేక్​అని తేలింది. మేలో మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ కు ఇలాంటి నకిలీ ఈ మెయిల్ వచ్చింది. అలాగే, సాదిక్ నగర్‌లోని ఇండియన్ స్కూల్‌కు సైతం రెండు సార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి.