ఢిల్లీలో మెరుగుపడ్డ ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో మెరుగుపడ్డ ఎయిర్ క్వాలిటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. దీంతో ప్రైమరీ స్కూళ్లను బుధవారం నుంచి రీఓపెన్ చేయనున్నట్లు కేజ్రీవాల్ సర్కారు ప్రకటించింది. ఇదివరకే ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోం ఆర్డర్​ను రద్దు చేసింది. ఉద్యోగులంతా ఎప్పట్లాగే డ్యూటీలకు రావాలని చెప్పింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. సివియర్ స్థాయిలో ఢిల్లీని కాలుష్యం కమ్ముకోవడంతో ప్రైమరీ స్కూళ్లకు ప్రభుత్వం గత శనివారం నుంచి సెలవులు ప్రకటించింది. ఉద్యోగులలో సగం మందిని ఇంటినుంచే పనిచేయాలని ఆదేశించింది. 

గడ్డి కాల్చుడు తగ్గడం వల్లే..

ప్రస్తుతం చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటపొలాల్లో గడ్డి తగలబెట్టడం తగ్గిందని, దీంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ వేగంగా మెరుగుపడిందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జారీ చేసిన కండిషన్లను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వివరించారు. కాగా, ఎన్సీఆర్​లో గత రెండ్రోజులుగా వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ ప్రకటించింది. నాన్ బీఎస్ – 6 డీజిల్ లైట్ మోటారు వెహికల్స్​ను ఢిల్లీలోకి రావొద్దన్న ఆదేశాలను వాపస్ తీసుకోవాలని ప్యానెల్ అధికారులు కేజ్రీవాల్ సర్కారుకు సూచించారు. దీంతో బ్యాన్ ఎత్తివేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలో శుక్రవారం  సగటు గాలి నాణ్యత ఏక్యూఐలో 447 సూచించగా.. శనివారం నాటికి 381కి, ఆదివారం నాటికి 339కి మెరుగుపడింది.