ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చండి: కేంద్రానికి బీజేపీ MP లేఖ

ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చండి: కేంద్రానికి బీజేపీ MP లేఖ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పేరు మార్పు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని డిమాండ్ చేస్తూ చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హిందూ ఇతిహాసం మహాభారతం ప్రకారం ఇంద్రప్రస్థం యమునా నది ఒడ్డున పాండవులు స్థాపించిన రాజధాని నగరమని.. నాగరికత వారసత్వం మేరకు ఢిల్లీ పేరును తిరిగి ఇంద్రప్రస్థంగా పునరుద్ధరించాలని కోరారు.

అలాగే.. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ఇంద్రప్రస్థ జంక్షన్‌గా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంద్రప్రస్థ విమానాశ్రయంగా పేరు మార్చాలని ఖండేల్వాల్ రిక్వెస్ట్ చేశారు. పాండవులు స్థాపించిన రాజధానిగా ఢిల్లీ మూలాలను గుర్తించడానికి నగరంలోని ఒక ప్రముఖ ప్రదేశంలో పాండవుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. లేఖ కాపీలను అమిత్ షాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రామ్ మోహన్ నాయుడు, గజేంద్ర సింగ్ షెకావత్‎లకు కూడా పంపారు ఖండేల్వాల్.

ఇంద్రప్రస్థ అనే పేరు భారతదేశ నాగరికత మూలాలను, నీతివంతమైన పాలన విలువలను, సాంస్కృతిక విశ్వాసాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.  ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి వంటి అనేక పురాతన భారతీయ నగరాలు ఇటీవల తమ సాంస్కృతిక గుర్తింపులను పేర్లను తిరిగి పొందాయని.. అదే విధంగా ఢిల్లీని కూడా దాని అసలు పేరుకు పునరుద్ధరించాలని ఎంపీ కోరారు.

ALSO READ : పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా..

ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా పునరుద్ధరించడం చారిత్రక న్యాయం, సాంస్కృతిక పునరుజ్జీవన చర్యగా అభివర్ణించారు ఖండేల్వాల్. రాజధాని పేరు మార్చడం ప్రధాని మోడీ సాంస్కృతిక పునరుజ్జీవన దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. ఢిల్లీలోని ఒక ప్రధాన బహిరంగ ప్రదేశంలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని.. అవి యువతరానికి ధైర్యం, త్యాగం, న్యాయం, నీతి ఆదర్శాలను గుర్తు చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.