పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా..చరిత్రకెక్కిన కేరళ

పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా..చరిత్రకెక్కిన కేరళ

దేశంలో అత్యంత పేదరికం నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది.ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం(నవంబర్​1)  అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు.ఈ ఘనతకు గుర్తాగా కేరళ  పిరవి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.ఇప్పటికే 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలిరాష్ట్రంగా నిలిచిన కేరళ.. అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా మరో ఘనత సాధించింది. 

కేరళ పేదరికాన్ని ఎలా ఎదుర్కొంది?

దేశంలో100 శాతం అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రం  కేరళ.. మొదటి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో విద్యుదీకరణ చేసిన రాష్ట్రంగా కేరళ ముందుంది. వందలాది మందిని అత్యంత పేదరికం నుంచి బయట పడేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చైనా తర్వాత అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రెండో ప్రాంతంగా కేరళ నిలిచింది. 

వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 20వేల648 కుటుంబాలకు రోజువారీ ఆహారాన్ని అందిస్తోంది కేరళ ప్రభుత్వం. వారిలో 2వేల210 మందికి వేడి భోజనం..85వేల721 మందికి అవసరమైన చికిత్స ,మందులు అందిస్తోంది. వేలాది మందికి ఇండ్లు కట్టించింది. 

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5వేల400 కి పైగా కొత్త ఇళ్ళు నిర్మించి పేదలకు అందించింది. 5వేల 522 ఇళ్లకు రిపేర్లు చేయించింది.  భూమిలేని 2వేల 713 కుటుంబాలకు ఇళ్లు నిర్మాణానికి భూమిని పంచింది. 

అంతేకాకుండా 21వేల263 మందికి రేషన్ కార్డులు, ఆధార్ ,పెన్షన్లు వంటి కీలక గుర్తింపు కార్డులను మొదటిసారి అందించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 4వేల 394 కుటుంబాలకు జీవనోపాధి కల్పించామని సీఎం విజయన్​ తెలిపారు. 

కేరళ పేదరిక నిర్మూలన కార్యక్రమం (EPEP) కింద రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పేదరికంలో ఉన్న 64వేల 006 కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యేక అవసరాలకు అనేక ప్రణాళికలు సిద్దం చేసింది విజయన్​ ప్రభుత్వం. 

LDF ,UDF పరిపాలనల కింద స్థానిక సంస్థల భాగస్వామ్యంతో రాజకీయ సరిహద్దులను అధిగమించి సమన్వయంతో చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ విజయం అని సీఎం విజయన్​  స్పష్టం చేశారు.