ఢిల్లీలో ఘనంగా బీటింగ్ రీట్రీట్​సెలబ్రేషన్స్

ఢిల్లీలో ఘనంగా బీటింగ్ రీట్రీట్​సెలబ్రేషన్స్

న్యూఢిల్లీ: ఏటా గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ సెలబ్రేషన్స్ సోమవారం ఢిల్లీలోని విజయ్ చౌక్​లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాతకాలం నాటి గుర్రపు బగ్గీలో వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖడ్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల నడుమ రాష్ట్రపతి రాకతో కార్యక్రమం ప్రారంభం అయింది. 

లెఫ్టినెంట్ కల్నల్ విమల్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ‘ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఎపీఎఫ్) మ్యూజిక్ బ్యాండ్లు, దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం శంఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాద్ ట్యూన్ తో ప్రారంభం అయింది. ఆ తర్వాత వీర్ భారత్, సంగమ్ దూర్, దేశోన్ కా సర్తాజ్ భారత్, భగీరథి, అర్జున ట్యూన్లను వివిధ వాయిద్యాలు, డ్రమ్ లతో ప్లే చేశారు. 

బీటింగ్ రీట్రీట్ ను 1950లో ఇండియన్ ఆర్మీ మేజర్ రాబర్ట్స్ జాతీయ బ్యాండ్లను ప్రదర్శించే ప్రత్యేక వేడుకగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వేడుక ఏటా సంప్రదాయంగా జరుగుతూ వస్తోంది. శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎదుర్కొనే పరిస్థితులను, ఆయుధాలను తరలించడం, శత్రువులతో తలపడటం వంటి అంశాలను సింబాలిక్ గా ప్రదర్శిస్తారు. గత కాలంనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ వేడుక సాగుతుంది.