కుక్క భయంతో మూడో ఫ్లోర్ నుంచి దూకిన డెలివరీ బాయ్

కుక్క భయంతో మూడో ఫ్లోర్ నుంచి దూకిన డెలివరీ బాయ్

గచ్చిబౌలి, వెలుగు : డెలివరీ ఇద్దామని ఓ అపార్ట్​మెంట్​లోని మూడో ఫ్లోర్​కి వెళ్లిన డెలివరీ బాయ్​ మీదకు ఓ ఇంట్లో నుంచి పెంపుడు కుక్క రావడంతో భయంతో అతను కిందకు దూకాడు. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్​కు గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మణికొండలో ఆదివారం జరిగింది. మణికొండ పంచవటి కాలనీలో శ్రీనిధి హైట్స్ అపార్ట్​మెంట్​లోని మూడో ఫ్లోర్​లో  డాక్టర్ సుబ్బరామిరెడ్డి​ నివాసం ఉంటున్నాడు. ఓ యాప్ లో ఆయన ఆర్డర్​ పెట్టుకున్నాడు. ఆ ఆర్డర్​ డెలివరీ చేసేందుకు ఫలక్​నుమాకు చెందిన డెలివరీ బాయ్​ మహమ్మద్​ ఇలియాజ్​(30) ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు అపార్ట్​మెంట్​ మూడో ఫ్లోర్​కు చేరుకున్నాడు. ఒక్కసారిగా డాక్టర్​ ఇంట్లో నుంచి అతని పెంపుడు కుక్క అరుస్తూ ఇలియాజ్​ మీదకు దూసుకెళ్లబోయింది. భయంతో ఇలియాజ్  మూడో ఫ్లోర్​ నుంచి కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని  సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అతనికి ఒక కాలు విరిగిపోయిందని, బాధితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని రాయదుర్గం పోలీసులు చెప్పారు.

వీధి కుక్క దాడిలో 15 మందికి గాయాలు
    మహబూబాబాద్ జిల్లాలో ఘటన

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పిచ్చి కుక్క దాడిలో పలువురు గాయపడ్డారు. ఆదివారం మండలంలోని ఆనేపురం, వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందితో పాటు రెండు పశువులను పిచ్చి కుక్క కరిచింది. రోడ్లపై వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తుండటంతో వెంకయ్య తండా సర్పంచ్ సూరా నాయక్‌‌తో పాటు గ్రామస్తులు ఆ కుక్కని చంపేశారు. కుక్క కాటుకు గురైన వారందరూ మరిపెడ పీహెచ్‌‌సీలో వ్యాక్సిన్‌‌ వేయించుకున్నారు. మరో 8 మందిని మెరుగైన చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌‌కి తరలించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో గ్రామాల్లో వీధి కుక్కలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిని కరుస్తున్నాయని, చిన్న పిల్లలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ కోరారు.