హైదరాబాద్ సిటీలో గోడౌన్ బూమ్

హైదరాబాద్ సిటీలో  గోడౌన్ బూమ్

హైదరాబాద్‌‌ వేర్‌‌హౌసింగ్‌‌ మార్కెట్‌‌ పరిమాణపరంగా 96 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018 లో మొత్తం 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని వేర్‌‌హౌస్‌‌లను లీజ్‌‌ ప్రాతిపదికన కస్టమర్లు తీసుకున్నారు. 2017 తో పోలిస్తే ఈ విస్తీర్ణం 96 శాతం ఎక్కువని నైట్‌‌ అండ్ ఫ్రాంక్‌‌ రిపోర్టు వెల్లడించింది. దీంతో వృద్ధిలో దేశంలోనే మూడో ప్లేస్‌‌లో నిలిచింది. కోల్‌‌కత్తా, బెంగళూరు మాత్రమే మనకంటే ముందుండగా, ఎన్‌‌సీఆర్‌‌, చెన్నై ఇతర నగరాలు మన వెనక ఉన్నాయి. హైదరాబాద్‌‌లో వేర్‌‌హౌసింగ్‌‌ డిమాండ్‌‌ పెరగడానికి ప్రధాన కారణం ఈ–కామర్స్‌‌ బాగా పుంజుకోవడమేనని చెబుతున్నారు. 2018 లో లీజుకు తీసుకున్న మొత్తం వేర్‌‌హౌసింగ్ విస్తీర్ణంలో 40 శాతం ఈ–కామర్స్‌‌ రంగంలోని కంపెనీలే తీసుకోవడం విశేషం. హైదరాబాద్‌‌ సమీపంలోని జీడిమెట్ల, మేడ్చల్‌‌, కొంపల్లి క్లస్టర్‌‌లోనే ఎక్కువగా వేర్‌‌హౌసింగ్‌‌ కార్యకలాపాలు సాగుతున్నాయి. మొత్తం వేర్‌‌హౌసింగ్‌‌ మార్కెట్లో ఈ క్లస్టర్‌‌కు దాదాపు 70 శాతం వాటా ఉంది.  ఎయిర్‌‌పోర్టుకు సమీపంగా ఉండటం, బెంగళూరు హైవే మీద ఉండటంతో ఇటీవల కాలంలో శంషాబాద్–షాద్‌‌నగర్‌‌ వైపూ వేర్‌‌హౌసింగ్‌‌ కార్యకలాపాలు పెరుగుతున్నాయి.

ఎఫ్‌‌ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్‌‌తోపాటు ఈ–కామర్స్‌‌ కంపెనీలూ కొంపల్లి–మేడ్చల్‌‌ క్లస్టర్‌‌లో వేర్‌‌హౌసింగ్‌‌కు మొగ్గుచూపుతున్నాయి. సికిందరాబాద్‌‌–హైదరాబాద్‌‌లకు సమీపంలో ఉండటం వల్లే ఈ క్లస్టర్‌‌కు ఎక్కువ ఆదరణ ఉందని నైట్‌‌ అండ్‌‌ ఫ్రాంక్‌‌ రిపోర్టు తెలిపింది. ఇక పటాన్‌‌చెరు క్లస్టర్ మంచి ఆప్షన్‌‌ అయినప్పటికీ, ఇటీవలి కాలంలో అక్కడ రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు భారీగా పుంజుకోవడం వేర్‌‌హౌసింగ్‌‌ రంగానికి పెద్ద సవాలుగా మారింది. హైటెక్‌‌సిటీకి దగ్గరగా ఉండటంతో ఐటీ ఉద్యోగుల రెసిడెన్షియల్‌‌ డిమాండ్‌‌తో  పటాన్‌‌చెరు ప్రాంతంలో రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు చుక్కలనంటుతున్నాయని నైట్‌‌ అండ్‌‌ ఫ్రాంక్‌‌ అభిప్రాయపడుతోంది.  గతంలో పూర్వీకులు ఇచ్చిన భూమిలో సాధారణ గోడౌన్లు కట్టేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌‌ మారింది. అత్యాధునికమైన వేర్‌‌హౌస్‌‌ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. కాకపోతే భవిష్యత్లో శంషాబాద్ క్లస్టర్‌‌ వేర్‌‌హౌసింగ్‌‌ మార్కెట్లో లీడర్గా అవతరించే అవకాశాలున్నాయని నైట్‌‌ అండ్‌‌ ఫ్రాంక్‌‌ అంచనా వేస్తోంది. వేర్‌‌హౌసింగ్ రంగంలోని ప్రముఖ కంపెనీలు రియాల్టీ డెవలపర్లతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలను చూస్తే ఈ విషయం అర్థమవుతోందని చెబుతోంది.