వెలుగు ఓపెన్ పేజీ : నీటి వృథాను అరికట్టాలి

వెలుగు ఓపెన్ పేజీ :  నీటి వృథాను అరికట్టాలి

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్న కొద్దీ నీళ్లకు  కరువొస్తోంది. 1950లో తలసరి నీటి లభ్యత 18 వేల క్యూబిక్ మీటర్లు ఉంటే 2025లో అది 5 వేల లీటర్లకు పడిపోయింది.  వివిధ దేశాల్లోని 295 ప్రాంతాల్లో నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది.  మరో 780 చోట్లా  నీళ్లకు కటకటలాడాల్సిన  పరిస్థితి  కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న 190 కోట్ల మంది భవిష్యత్తుకు అది ప్రమాదంగా మారుతోంది. అధిక వినియోగంతో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తుండటం,  నదులు జీవకళ కోల్పోతుండటం, వర్షపాతంలో మార్పులు మూలంగానే నీటి కొరత  తీవ్రం అవుతోంది. ఈ నేపథ్యంలో  నీటి వృథాను అరికట్టాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నీటి సమస్య కొత్తది కాదు. రానురాను ఇది తీవ్రమవుతోంది.  వర్షాభావం, భూగర్భ జలాల అధిక వినియోగం,  నీటి నిర్వహణలో లోపం వంటివన్నీ  నీటి సంక్షోభం వైపు నెడుతున్నాయి.  ప్రతి వేసవి కాలం గ్రామాల్లో  తాగునీటి కోసం ప్రజలు  కిలోమీటర్ల దూరం వెళ్లవలసిన  పరిస్థితి ఈ నాటికీ ఉంది. 


నీటి కొరత  కారణంగా  రైతులు తమ  పంటలను  సాగు చేయలేక బీడు భూములుగానే వదిలేస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం నేటికీ సాగుభూమిలో  నలభై శాతం వరకూ పంటలు పండించలేకపోతున్నారు. రాష్ట్రాల మధ్య నీటి జగడాలు ఉండనే ఉన్నాయి. ఇవి పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.    ఏటా వేల టీఎంసీల  నీరు  సముద్రంలో  కలిసిపోతున్నా సమర్థంగా  వినియోగించుకొంటున్న  దాఖలాలు లేవు.  వర్షపు నీటిని సంరక్షిస్తే తప్ప ప్రయోజనం ఉండదు.  చెరువులు, కాలువలను  పునరుద్ధరించాలి.    పంటల నమూనా మార్చి నీటి వినియోగాన్ని తగ్గించాలి.  నీరు కేవలం సహజ వనరు కాదు. అది జీవన ఆధారం అని గుర్తించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు సంక్షోభంలో పడటం ఖాయం.  తెలంగాణ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చిలోనే తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది.  ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి  నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు బాగా పడిపోవడం వల్ల గ్రామాల్లోనూ,  హైదరాబాద్ నగరంలోనూ తాగు నీటి సమస్య పెరిగింది. 

 మితిమీరిన  భూగర్భ జలాల వాడకం

మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడం,   కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో  నీటి మట్టాలు తగ్గడం వంటి కారణాల వల్ల నీటి లభ్యత కష్టంగా మారింది.  ట్యాంకర్లతో నీటి సరఫరా పెరిగిపోవడంతో ట్యాంకర్ల ధరలు అందుబాటులో లేకుండా ఉన్నాయి.  కొండాపూర్,  మాదాపూర్,  గచ్చిబౌలి, అమీర్​పేట్ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది.  వరి వంటి నీటి ఆధారిత పంటల సాగువల్ల నీటి నిల్వలు వేగంగా  తగ్గిపోతున్నాయి. ఎండల తీవ్రత, తక్కువ వర్షపాతం, పెరిగిన కాంక్రీట్ నిర్మాణాలు,  భూగర్భ జలాల  మితిమీరిన వాడకం  నీటి కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.  జలమండలి గణాంకాల ప్రకారం గత నెల చివరి నాటికి  నగరంలో  రోజువారీ  ట్యాంకర్ల డిమాండ్ 8,500 కి పెరిగింది.  వచ్చే రెండు నెలల్లో ఈ డిమాండ్ రోజుకు  పది వేల ట్యాంకర్ల  మించి  చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  డిమాండ్​కు  అనుగుణంగా  జలమండలి  ఎన్ని  ప్రయత్నాలు  చేస్తున్నా వినియోగదారులకు నీటి నిరీక్షణ తప్పడం లేదు.  తప్పనిసరి  పరిస్థితుల్లో  ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.  సాధారణంగా రూ.800 నుంచి వెయ్యి రూపాయలు ఉండే ట్యాంకర్ ధర ఇప్పుడు  

2 వేల రూపాయలు అయింది.
నీటి వినియోగంలో బాధ్యత అవసరం

నగరంలో ఉన్న వేలాది  హాస్టళ్లలో  విద్యార్థులు,  ఉద్యోగులు  ఉంటున్నారు. ఇక్కడ నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. రోజుకు  రెండు మూడు ట్యాంకర్లు అదనంగా రప్పించడం వల్ల హాస్టల్ యజమానులు అదనపు భారం మోయక తప్పడం లేదు.  భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం.  వర్షాలు కురిసిన సందర్భంలో అనుకూలంగా కనిపించినా అవి తగ్గుముఖం పట్టగానే  భూగర్భ జలాలు కూడా క్రమంగా తగ్గుతూ పోతున్నాయి. నేలలో  ఇంకే నీటి కన్నా వినియోగం పెరగడం వల్ల నీటి లభ్యత తగ్గిపోతోంది. లోటు వర్షపాతం ఉంటే ఆ ప్రభావం భూగర్భ జలాలపై ఎక్కువగా ఉంటుంది.  పది నుంచి ఇరవై శాతం లోటు నమోదైతే  భూమిలోకి ఇంకే నీరు ఏకంగా 25 నుంచి 50  శాతం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.  నీటి వినియోగంలో బాధ్యతాయుత ధోరణి అవసరం. ప్రతి నీటి బొట్టు అమూల్యం అనే భావనతో అందరూ ముందుకు రావాలి. 

- జి.యోగేశ్వరరావు, 
జర్నలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.