కర్నాటకలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు.. తెరపైకి ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్

కర్నాటకలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు.. తెరపైకి ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్

బెళగావి: కర్నాటకలో ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బలంగా వినిపిస్తోంది. శీతాకాల శాసనసభ సమావేశాలకు ముందు ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్ర డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బెళగావిలోని కాగ్వాడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ (రాజు) కేజ్ ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. నార్త్ -వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేస్తున్న రాజు కేజ్ నవంబర్ 4నే ఈ లేఖ రాశారు.

బీదర్, కలబురగి, విజయపుర, యాద్గిర్, బాగల్‌కోట్, బెలగావి, ధార్వాడ్, గడగ్, కొప్పల్, రాయచూర్, ఉత్తర కన్నడ, హావేరి, విజయనగర్, బళ్లారి మరియు దావణగెరె.. ఈ 15 జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేజ్ తన లేఖలో ప్రతిపాదించారు. బెళగావిని కర్ణాటక రెండవ రాజధానిగా ప్రకటించాలని, సువర్ణ విధాన సౌధలో రాష్ట్ర స్థాయి సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రత్యేక ఉత్తర కర్నాటక రాష్ట్రం డిమాండ్ చేస్తున్న నిరసనకారులు ఆందోళన చేశారు.

రాష్ట్ర కార్యాలయాలను బెళగావికి మార్చాలని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం కిత్తూరు కర్ణాటక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కర్ణాటక విభజన డిమాండ్ కొత్తది కాదని, మాజీ మంత్రి దివంగత ఉమేష్ కత్తి దశాబ్దం క్రితం ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. రాజకీయ ఒత్తిడి కారణంగా ఆయన తరువాత తన వైఖరిని మార్చుకున్నప్పటికీ, ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాజు కేజ్ చెప్పారు.

Also Read:- తాళికట్టిన వెంటనే.. పెళ్లి కొడుకును కత్తితో పొడిచాడు.. 2 కిలోమీటర్లు వెంటాడిన డ్రోన్ కెమెరా

కర్ణాటక ఏకీకరణ తర్వాత, ఉత్తర కర్ణాటక ప్రాంతం అన్ని రంగాలలో అన్యాయాన్ని, సవతి తల్లి వైఖరిని ఎదుర్కొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో కన్నడ మాట్లాడే రాష్ట్రం ఆవిర్భవిస్తే అది కర్నాటకకే గర్వ కారణం అని రాజు కేజ్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సంతకాల సేకరణకు పూనుకున్న ఉత్తర కర్ణాటక పోరాట సమితికి కూడా కేజ్ తన మద్దతు ప్రకటించారు.