- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
జహీరాబాద్, వెలుగు: ఓటు వేయలేదనే కారణంతో దళితుడిపై దాడి చేయడాన్ని అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామని, దళితుడి ఇల్లు కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఓటు వేయలేదన్న కారణంతో కూల్చిన దళితుడి ఇంటిని బుధవారం కమిషన్ సభ్యుడు రాంబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడిపై దాడికి పాల్పడిన ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు అట్టెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశిస్తానని తెలిపారు.
ఇల్లు కూల్చాలని ప్రోత్సహించిన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. బేగరి రాములుపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆయనకు ఇల్లు కట్టించి, పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ నెల 30న సజ్జాపూర్ లో సివిల్ రైట్స్ డేను అధికారికంగా నిర్వహించాలని సూచించారు. సివిల్ హక్కుల ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో జానకీరెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
