- కంగెర్లుసువాక్ లో దిగిన 58 మంది సైనికులు
- సాధారణ కార్యకలాపాల కోసమేనన్న నాటో దేశం
- వెనక్కి తగ్గని అమెరికా.. యుద్ధవిమానాన్ని పంపించేందుకు సిద్ధం
వాషింగ్టన్: అమెరికా భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తుండటంతో డెన్మార్క్ కీలక చర్యలు చేపట్టింది. గ్రీన్లాండ్లో కొత్తగా సైనిక బలగాలను మోహరించింది. సోమవారం సాయంత్రం కంగెర్లుసువాక్ లో 58 మంది సైనికులను దించింది. రాయల్ డానిష్ ఆర్మీ చీఫ్ పీటర్ బాయ్సెన్ నేతృత్వంలో సైనికులు చార్టర్డ్ ప్లైట్‌లో గ్రీన్లాండ్లో ల్యాండ్ అయ్యారు.
అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే డెన్మార్క్.. గ్రీన్లాండ్లో ‘ఆపరేషన్ ఎండ్యూరెన్స్’ పేరిట మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తున్నది. ఈ సైనిక విన్యాసాల్లో నాటో కూటమిలోని పలు దేశాలకు చెందిన 60 మంది సైనికులు పాల్గొంటున్నారు. కొత్తగా వచ్చిన బలగాలు వీరితో చేరనున్నాయి.
సైనికులను భారీగా దించడంపై డెన్మార్క్ స్పందించింది. గ్రీన్లాండ్లో కేబుల్స్, రాడార్లు, రన్ వేలు ధ్వంసం కాకుండా చూడటం కోసమే ఈ దళాలను రంగంలోకి దింపామని తెలిపింది.
గ్రీన్‌లాండ్‌పై అమెరికా దూకుడు
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశంలో తమకు కీలక పోర్టు అయిన పిటుఫిక్ స్పేస్ బేస్ లో యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనది. ఈ మేరకు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్(నోరాడ్) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. త్వరలోనే తమ సైనిక విమానం పిటుఫిక్ స్పేస్ బేస్‌కు చేరుకుంటుందని తెలిపింది.
మిస్సైల్స్, శాటిలైట్స్‌ను ట్రాక్ చేయడంలో భాగంగా ఈ మోహరింపును చేపట్టినట్టు పేర్కొంది. డెన్మార్క్ డిప్లోమాట్స్కు కూడా దీని గురించి ముందుగానే సమాచారం అందించామని చెప్పింది.
