కమ్మేసిన పొగమంచు..జీరోకి పడిపోయిన విజిబిలిటీ

 కమ్మేసిన పొగమంచు..జీరోకి పడిపోయిన విజిబిలిటీ

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిన దట్టమైన పొగ మంచు కమ్ముకుంది.  దీంతో ఢిల్లీ, చండీగఢ్ సహా ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో విజిబిలిటీ జీరోకి పడిపోయింది.  ఈ చలికాలంలో  ఢిల్లీలో తొలిసారిగా జీరో విజిబిలిటీ నమోదైయింది.  దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని రవాణా  వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   రోడ్లపై డ్రైవింగ్ చాలా సవాలుగా మారింది. పార్కింగ్ లైట్లు, హెడ్ లైట్లు వేసి 10-20 కి.మీ.ల వేగంతో వాహనాలు నడుపుతున్నారు.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీ చేరుకోవాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు.  7 విమానాలను జైపూర్ కు, ఒక విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు  అధికారులు. 

ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్‌, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది.  మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సిన 22 రైళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.  

ఢిల్లీని చలి వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. సిటీ శివారులోని ఆయానగర్ లో శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోయింది.  దీంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ కు రెడ్ అలర్ట్ ఇవ్వగా.. రాజస్థాన్ కు యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఎన్సీఆర్ పరిధిలో మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది.