హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇంటర్ లోకల్ క్యాడర్ కింద డిప్యుటేషన్ మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య ఉత్తర్వులిచ్చారు. ఉద్యోగుల విభజన సమయంలో స్థానచలనం పొంది, రీ- అలాట్‌మెంట్‌లో ప్రయోజనం పొందలేకపోయినవారికి ఈ అవకాశం కల్పించారు.
జీవో నెం.190లోని నిబంధనలను సడలిస్తూ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లతో సంబంధం లేకుండా ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించనున్నారు. రెండేండ్ల కాలానికి ఈ డిప్యుటేషన్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. యూనియన్ల విజ్ఞప్తులు, మంత్రుల సిఫార్సులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
