వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారంటీలు

వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారంటీలు
  • రాహుల్ ను ప్రధాని చేయాలనేదిఆయన ఆఖరి కోరిక: సీఎం రేవంత్
  • కాంగ్రెస్​ను వీడిన వారంతా తిరిగిరావాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • గాంధీ భవన్​లోమాజీ సీఎం వైఎస్​ జయంతి సభ
  • ప్రజాభవన్​లో ఫొటో ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనే స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు సీఎంగా వైఎస్ అమలు చేసిన అభివృద్ధి పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపే తనను సైతం సీఎంగా ఈ మార్గం వైపు నడిచేలా చేసిందన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా సోమవారం గాంధీ భవన్ లో సీఎం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ స్ఫూర్తిని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు.

దేశంలో సంక్షేమం అంటే గుర్తు వచ్చే పేరు వైఎస్ఆర్.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వైఎస్ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకొని అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండింటిపై వైఎస్ఆర్ ముద్ర ఉందన్నారు. మూసీ, మెట్రో రైల్, గోదావరి, కృష్ణా జలాలు, హైదరాబాద్ లో పెట్టుబడులు..ఇలా వీటన్నింటికి కూడా వైఎస్సే తనకు స్ఫూర్తి అని చెప్పారు. 2009 లో రెండోసారి వైఎస్ సీఎం అయిన తర్వాత  రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, ఇదే తన చివరి కోరిక అని వైఎస్ చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయన్నారు.

అయితే వైఎస్ స్ఫూర్తితో దేశంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొట్లాడి రాహుల్ ని ప్రధానిని చేయాలన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ 75వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు రాహుల్ ప్రధాని కావాలన్న ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ లోకి వచ్చి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 

మరో రెండు దశాబ్ధాలు కాంగ్రెస్సే

డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. .రాబోయే రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని పిలుపు నిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఉపయోగపడ్డాయని, వైఎస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం ద్వారా ఈ రోజు తెలుగు వారు ప్రపంచాన్ని శాసిస్తున్నారన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చాడన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు. తర్వాత ఇందిరా భవన్ లో రక్తదాన శిబిరాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం సీఎం అసెంబ్లీకి వెళ్లి సీఎల్పీలో వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా గాంధీ భవన్ సిబ్బందికి, సీఎల్పీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు.

పంజాగుట్టలో రేవంత్​నివాళి

మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతిని కాంగ్రెస్​ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్​లోని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ హారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీ లు మల్లు రవి, అనిల్​ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ, మధు యాష్కీ గౌడ్, కేవీపీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్, పి.విజయా రెడ్డి పాల్గొన్నారు.

ఫొటో ఎగ్జిబిషన్​లో నాయకుల భావోద్వేగం

ప్రజాభవన్​లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తిలకించారు.  ప్రదర్శనలో వైఎస్ ఫొటోలను చూసి నాయకులంతా ఆయనతో తమకున్న అనుబంధాన్ని,  అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలు చూస్తూ నాయకులు భావో ద్వేగానికి లోనయ్యారు. దీనికి ముందు పంజాగుట్ట, బంజారాహిల్స్ లోని వైఎస్ విగ్రహాలకు సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు నివాళి అర్పించారు.