- 99 రోజుల యాక్షన్ ప్లాన్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఈ రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటుంది ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో 99 డేస్ యాక్షన్ ప్లాన్ సబ్ కమిటీ సమావేశం భట్టి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అధికారులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు సూచనలు చేశారు.
వివిధ స్థాయిల్లో ఏ తరహా కార్యక్రమాలు చేపట్టాలి, వివిధ శాఖలను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, పూర్తి సమాచారంతో కూడిన నివేదికలు రూపొందించడం అనే అంశాలను జోడించాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, యోగితా రానా, క్రిస్టినా, అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల..
మరోవైపు, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ చానల్‌లో నిధులను విడుదల చేస్తోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకి సంబంధించి బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ప్రతి నెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదలైన నిధుల్లో గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి.
ఇదిలాఉండగా ఉద్యోగ సంఘాల నాయకులు డిప్యూటీ సీఎంని కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రజల కోసం నిలబడాలని సూచించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, కోటి రూపాయల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను 010 పద్దు కింద తీసుకురావడంపై ఉద్యోగ సంఘాల నాయకులు భట్టికి కృతజ్ఞతలు తెలిపారు.
