తాడిచర్ల కోల్ బ్లాక్ 2లో..మైనింగ్​కు అనుమతివ్వండి : భట్టి

తాడిచర్ల కోల్ బ్లాక్ 2లో..మైనింగ్​కు అనుమతివ్వండి : భట్టి
  • గత బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు: భట్టి
  • 30 ఏండ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు తీయొచ్చు
  • వర్చువల్ మీటరింగ్​కు సహకరించండి
  • కేంద్ర మంత్రులను కోరిన డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణికి కేటాయించిన తాడిచర్ల కోల్​బ్లాక్ 2లో బొగ్గు ఉత్పత్తికి అనుమతివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందుకోసం తాడిచర్ల బ్లాక్ మైనింగ్ కోసం ప్రేయర్ అప్రూవల్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా శాస్ర్తి భవన్​లో ప్రహ్లాద్ జోషితో భట్టి విక్రమార్క గురువారం భేటీ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచర్లలోని కోల్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తికి అనుమతులు తీసుకోలేదన్నారు. దీంతో సింగరేణికి తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. 2013లోనే ఈ బ్లాక్​ను సింగరేణికి కేటాయించారని గుర్తు చేశారు. 30 ఏండ్ల పాటు 182 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీయొచ్చని కేంద్ర మంత్రికి భట్టి విక్రమార్క వివరించారు. 

జైపూర్ పవర్ ప్లాంట్ కోసం ఒడిశాలోని నైని కోల్ బ్లాక్​ను గతంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, మైనింగ్​కు కావాల్సిన పర్మిషన్లు మాత్రం గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకోలేదని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఒడిశా సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, తాడిచర్ల కోల్​బ్లాక్ 2లో బొగ్గు ఉత్పత్తికి అనుమతుల కోసం ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. సుమారు అరగంట పాటు ప్రహ్లాద్ జోషితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సింగరేణి సమస్యలు, అవసరాలు గురించి కూడా జోషితో భట్టి విక్రమార్క చర్చించారు. 

సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సహకరించండి

ఆ తర్వాత, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​తోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్​ బిజిలి యోజన ద్వారా సబ్ స్టేషన్స్​లో వర్చువల్ మీటరింగ్ విధానంతో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి భట్టి కోరారు. పేదల ఇండ్లకు కరెంట్ సరఫరా చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందజేశారు. 

ఎంతో మంది పేదలు తమ ఇండ్లపై రూఫ్ టాప్ సౌకర్యం లేకపోవడంతో ఈ స్కీమ్ సబ్సిడీ పొందలేకపోతున్నారని వివరించారు. వారికి ప్రయోజనం కల్పించడానికి వర్చువల్ మీటరింగ్ విధానాన్ని అమలు చేసి, రాష్ట్ర సర్కార్​కు సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై స్పందించిన ఆర్​కే సింగ్.. మొత్తం పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ భేటీల్లో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రట‌‌‌‌రీ స‌‌‌‌య్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, సింగ‌‌‌‌రేణి సంస్థల కాలరీస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్‌‌‌‌.బ‌‌‌‌ల‌‌‌‌రాం, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, త‌‌‌‌దిత‌‌‌‌రులు ఉన్నారు.

బీఆర్ఎస్ నేతలకు ఆలోచనా జ్ఞానం లేదు: భట్టి

బీఆర్ఎస్ నేతలు అధికారంతో పాటు ఆలోచనా జ్ఞానం కూడా కోల్పోయారని భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షపాతాన్ని సైంటిఫిక్​గా నమోదు చేసే సిస్టమ్ దేశంలో ఉందన్నారు. కానీ.. బీఆర్ఎస్ నేతలు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 

నీటి ఎద్దడిపై కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వర్షాలు తక్కువ పడటంతో రిజర్వాయర్లలోని నీళ్లు అడుగంటిపోయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ సమస్య దేశమంతా ఉందని చెప్పారు. తెలంగాణలో బెంగళూరు లాంటి ఇబ్బంది రావొద్దని అందరూ కోరుకోవాలని ఆకాంక్షించారు. మేడిగడ్డ రిపేర్ చేయడానికి కేసీఆర్, కేటీఆర్ ఇంజినీర్లు కాదన్నారు. వాళ్లే ఇంజినీర్లు అని ఊహించుకొని కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ వ్యవహారంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని హితవు పలికారు.