- అప్పులపై, సింగరేణిపై ప్రతిపక్షనేతగా కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి
- కాంగ్రెస్ సర్కారు వచ్చాక చేసిన అప్పులు రూ.1.77 లక్షల కోట్లు
- బీఆర్‌ఎస్ అప్పులకు 2.08 లక్షల కోట్ల కిస్తీలు, వడ్డీలు కట్టినం
- ‘డెట్ రీస్ట్రక్చరింగ్’తో ఖజానాకు రూ.22,142 కోట్లు ఆదా చేసినం
- అప్పులపై హరీశ్, కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు
- రూ.1,142 కోట్ల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్న
- నా సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ స్పందించలే: జూపల్లి
హైదరాబాద్, వెలుగు: అబద్ధాల పునాదులపై ఏ ఆర్థిక వ్యవస్థనూ నిర్మించలేమని, పదేండ్లు పాలిచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కోలుకోలేని ఇబ్బందుల్లోకి నెట్టేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పదేండ్లు అడ్డగోలు దోపిడీతో సంపాదించిన సొమ్ముతో పెట్టుకున్న వార్తా సంస్థలు, సోషల్ మీడియా వ్యవస్థలతో సమాజంలో విధ్వంసం సృష్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో.. అంటే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా విప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులు, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న ప్రభుత్వ గ్యారంటీ లోన్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిస్కంల బకాయిలు.. ఇలా అన్ని రకాల అప్పులు కలిపితే మొత్తం రూ. 8 లక్షల 21 వేల 651 కోట్లకు చేరాయన్నారు.
ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఈ అప్పులన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసినవేనని, వీటికి వారు సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. తాము ఈ రెండున్నరేండ్లలో చేసిన అప్పులు రూ.లక్షా 77 వేల కోట్లు అని, ఈ మొత్తంతో పాటు ప్రభుత్వ ఖజానా నుంచి మరి కొంత కలిపి బీఆర్ఎస్ చేసిన అప్పులకు కొంత అసలు, వడ్డీ కలిపి రూ. 2 లక్షల08 వేల681 కోట్లు చెల్లింపులు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, ప్రభుత్వం ప్రాణప్రదంగా చూసుకునే సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలపైనా అబద్ధాలు ప్రచారం చేస్తుంటే, చూస్తూ ఉండలేక వాస్తవాలను లెక్కలతో సహా బహిర్గతం చేస్తున్నట్టు వివరించారు.
నా సవాల్ కేసీఆర్‌కే..
తన సవాల్ కేసీఆర్‌కేనని, ఆయన వచ్చి అప్పులు చేశారో? లేదో? చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ‘‘హరీశ్ రావు, కేటీఆర్ మాటిమాటికీ సీఎంకు, మంత్రులకు చాలెంజ్ విసురుతున్నారు. కేసీఆర్ రాడని.. మాకే సమాధానం చెప్పాలని అంటున్నరు. నేను ఒక్కటే అడుగుతున్నా.. 2014 నుంచి 2023 దాకా పదేండ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పేరుతో కొన్ని, గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్ అంటూ కొన్ని, కార్పొరేషన్ల పేరు మీద కొన్ని అప్పులు తెచ్చారు.
డిస్కమ్‌లకు బకాయిలు పెట్టారు. ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇతరత్రా బిల్లులు పెండింగ్ పెట్టారు. అన్నీ కలిపి రూ. 8 లక్షల కోట్లు దాటాయి. ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. హరీశ్, కేటీఆర్వచ్చి మేం అన్ని అప్పులు చేయలేదు.. ఇన్ని అప్పులు చేయలేదు.. అని చెప్తే కాదు. వీటిపై ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి” అని అన్నారు.
కార్పొరేషన్ అప్పులనూ మేమే కడ్తున్నం..
నాటి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో గ్యారంటీ తెచ్చి ఇచ్చిన అప్పులను కేటీఆర్, హరీశ్లెక్కలోకి తీసుకోవడం లేదని, అవి కూడా సర్కారు కట్టాల్సినవే కదా? అని భట్టి నిలదీశారు. ‘‘కాళేశ్వరం, మిషన్ భగీరథ కార్పొరేషన్ల పేరుతో గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. నాడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేటప్పుడు రైతుల నుంచి యూజర్‌చార్జీలు, ఇండ్ల దగ్గర నల్లా బిల్లులు వసూలు చేసి కడ్తామని, ఆయా అప్పులను కార్పొరేషన్లే తీరుస్తాయని, ప్రభుత్వం గ్యారంటీ మాత్రమే ఇస్తోందని నమ్మించారు.
తీరా ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ గానీ, మిషన్ భగీరథ సంస్థ గానీ ఆ అప్పులను కట్టే పరిస్థితి లేదు. దీంతో తమ ప్రభుత్వమే ఆ గుదిబండను మోయాల్సి వస్తోంది’’ అని చెప్పారు. ప్రతిపక్షాలు వీటిని అధికారిక అప్పుల కింద చూపించకుండా నాటకం ఆడుతున్నాయని, కానీ రాష్ట్రంలోని సామాన్య ప్రజలు ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యం కొనేటప్పుడు కట్టే పన్నుల సొమ్ముతోనే ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తోందని స్పష్టంచేశారు.
డెట్ రీస్ట్రక్చర్‌తో రూ.22,142 కోట్లు ఆదా చేశాం
గత ప్రభుత్వం ఎక్కడపడ్తే అక్కడ, అడ్డగోలుగా10.5శాతం మిత్తికి అప్పులు తెచ్చిందని, రాష్ట్రంపై వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం డెత్ రీస్ట్రక్చరింగ్ చేసిందని భట్టి పేర్కొన్నారు. తక్కువ వడ్డీకి దొరికే చోట అప్పులు తీసుకొని.. ఎక్కువ వడ్డీ ఉన్న చోట కడ్తున్నామన్నారు. దీని వల్ల మనకు ఏకంగా 22,142 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని వివరించారు.
కేసీఆర్ చేసిన అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీ, అసలు కలిపి అక్షరాలా 2 లక్షల08 వేల681 కోట్ల రూపాయలను ఆర్‌బీఐ ద్వారా బ్యాంకులకు చెల్లించిందని, కేసీఆర్ అప్పులు చేయకుండా ఉండి ఉంటే ఈ నిధులతో లెక్కలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేవాళ్లమన్నారు. ఓవైపు కేసీఆర్ చేసిన అప్పులు కట్టుకుంటూనే నెలనెలా ఉద్యోగస్తులకు జీతాలు, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
‘ప్రైవేట్’ బొగ్గు కోసం కేసీఆర్ కుట్ర
కేసీఆర్ తన పదేండ్ల పదవీకాలంలో సింగరేణిని అస్థిరపరచడానికి ప్రైవేట్సంస్థలు/ వ్యక్తులకు లాభాలు కలిగేలా కుట్ర చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కోయగూడెం, సత్తుపల్లి-3లాంటి బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడంలో గత బీఆర్‌ఎస్ సర్కార్ పాత్ర ఉందన్నారు. పదేండ్ల పాలనలో సింగరేణికి కొత్తగా ఒక్క కోల్ బ్లాక్‌నైనా తీసుకువచ్చారా? అని ఆయన ప్రశ్నించారు.
సింగరేణిని ఆర్థికంగా దెబ్బతీసి, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత సృష్టించి, ప్రైవేటు నుంచి కొనుగోలు చేయాలన్నదే గత బీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని మండిపడ్డారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం.. వాటికి అవసరమైన బొగ్గు గనులను మాత్రం ఎందుకు సమకూర్చలేదని నిలదీశారు. ‘‘కేంద్రం వేలం వేసిన కోల్ బ్లాకుల్లో పాల్గొని సింగరేణికి ఆ గనులను ఎందుకు దక్కించుకోలేదు? సింగరేణికి గనులు వస్తే రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయం తెలంగాణకే చెందేది కదా? అటు కొత్త గనులు తేరు.. ఇటు వేలంలో పాల్గొనరు.. అంటే రాష్ట్రంలో బొగ్గు కొరత సృష్టించి, విద్యుత్ ప్రాజెక్టులను సంక్షోభంలోకి నెట్టడమే మీ ఉద్దేశం కాదా?’ ’అని భట్టి నిలదీశారు.
వాళ్లది ఫక్తు దిగజారుడు రాజకీయం
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే పిల్లలకు క్వాలిటీ యూనిఫాంలు, షూస్, పెన్నులు, నోట్‌బుక్స్‌లాంటివి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఓపెన్ టెండర్లు పిలిస్తే.. దానిపైనా ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. గత పాలకుల లెక్క నాణ్యత లేని వస్తువులను సరఫరా చేయకుండా, క్వాలిటీ వస్తువులు ఇవ్వాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు.
‘‘విద్యార్థుల కిట్‌ల కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్ విలువ అక్షరాలా రూ. 1,142 కోట్లు.. కానీ అందులో ఏకంగా రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు అడ్డగోలుగా మాట్లాడడం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. ఒకసారి రూ. 2 వేల కోట్లు అంటారు.. ఇంకోసారి రూ.3 వేల కోట్లు అంటారు.. పదేండ్లపాటు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కూర్చున్న హరీశ్ రావు నేర్చుకున్న ఆర్థిక శాస్త్రం ఇదేనా? కనీస సోయి లేకుండా ఎలా మాట్లాడుతారు?’’ అని భట్టి ప్రశ్నించారు.
‘‘మా సీఎంకు, మంత్రులకు చాలెంజ్‌లు విసిరే హరీశ్ రావు, కేటీఆర్‌కు అసలు బాధ్యత ఉందా? వెనకా ముందు చూసుకోకుండా వీరు మాట్లాడితే సమాధానం చెప్పడానికి మా వాళ్లు గౌరవంతో ఒప్పుకోవచ్చు. కానీ, అసలు బాధ్యుడు పదేండ్లు రాష్ట్రాన్ని పాలించి, సర్వనాశనం చేసి, అప్పులపాలు చేసిన కేసీఆర్. అందుకే నేను నేరుగా మాజీ సీఎం కేసీఆర్‌కే సవాల్ విసురుతున్నా. ఆయన బయటకు వచ్చి ఈ అప్పులపై, సింగరేణిపై సమాధానం చెప్పాలి. నేను గతంలో సీఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండలేదు. అవసరమైతే నాటి అటెండెన్స్ రిజిస్టర్ చూసుకోవచ్చు’’ - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బొగ్గు మాయం ఆరోపణలపై విజిలెన్స్ విచారణ సింగరేణి కాలరీస్‌లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నందున బొగ్గు మాయం ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు.
సమగ్ర విచారణ అనంతరం వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ‘‘135 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణి ఆస్తులు, వనరులు రాష్ట్ర ప్రజలవి.. సంస్థ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తోంది. సింగరేణిలో వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క కేజీ బొగ్గు కూడా అక్రమంగా బయటకు వెళ్లే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారంతో సంస్థ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి’ అన్నారు.
