- నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోనే పోటీని తట్టుకోగలం
సత్తుపల్లి, వెలుగు : తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి ఆత్మ వంటిదని, దానిని కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ను పరిశీలించారు. అనంతరం సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాణ్యమైన బొగ్గు తోనే మంచి ఆదాయం వస్తుందని, ఉత్పత్తిలో స్పీడ్ పెంచాలని సూచించారు. పదేండ్ల తర్వాత పవర్ డిమాండ్ ను బట్టి కూడా సరిపడా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రణాళిక ఉండేలా చూడాలన్నారు.
మార్కెట్‌లో ప్రైవేట్ సంస్థలు పోటీకి వస్తున్నాయని, విదేశాల నుంచి సైతం కోల్ వస్తోందన్నారు. మార్కెట్ లో నిలబడాలంటే అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాడిచర్ల-2, నైనీ వంటి బ్లాక్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఫారెస్ట్ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించామని గుర్తు చేశారు. భవిష్యత్ లో దేశవ్యాప్తంగా జరిగే నూతన కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి పాల్గొనేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
సెమీకండక్టర్లు, చిప్ తయారీకి అవసరమైన క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ ప్రక్రియలోకి సింగరేణి ప్రవేశించాలని పిలుపునిచ్చారు. అనంతరం కిష్టారంలో నిర్మించిన ఆఫీసర్స్ క్వార్టర్ల ను ప్రారంబించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సింగరేణి డైరెక్టర్లు ఎల్ వీ. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, యం.తిరుమల రావు పాల్గొన్నారు.
గోదావరి జలాలతో చెరువులు నింపాలి
కొణిజర్ల/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలువ బోనకల్ బ్రాంచ్ కెనాల్ లాక్ లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిప్యూటీ సీఎం, సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి జలాలతో ఎన్‌ఎస్‌పీ కాలువ పరిధిలోని చెరువులను నింపాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకే వాడుకోవాలని ఆదేశించారు. అలాగే కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్‌ల్యాబ్ ను ప్రారంభించారు.
