జీఎస్టీ ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించండి

జీఎస్టీ ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించండి
  • ట్యాక్స్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం   కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియెట్ లో ట్యాక్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ ద్వారా రాష్ట్రం కోల్పోతున్న  ఆదాయంపై నివేదిక ఇవ్వాలన్నారు. జీఎస్టీ ఎగవేతదారులతో  కఠినంగా వ్యవహరించాలని, అదేవిధంగా నిఘా వ్యవస్థ నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లావాదేవీలు, పన్నుల వసూలులో వస్తున్న సమస్యలను అధిగమించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో అంతర్గతంగా కమిటీలు వేసి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు  డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్, డిప్యూటీ కమిషనర్లు సౌజన్య, వాసవి, సంయుక్తారాణి, సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.