బావ బామ్మర్దులు చెమటకక్కి సంపాదించలే: మంత్రి ఉత్తమ్

బావ బామ్మర్దులు చెమటకక్కి సంపాదించలే: మంత్రి ఉత్తమ్

 

  • బీఆర్‌ఎస్‌ స్వేదపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
  • రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటు
  • ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ షురువైంది
  • లెక్కలు కట్టి.. మొత్తం సొమ్మును కచ్చితంగా కక్కిస్తమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రిలీజ్ చేసిన స్వేదపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావమరదులు చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌రావులను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి, ప్రజలకు చెందాల్సిన సంపదను దోపిడీ చేసిన గత పాలకుల అవినీతిపై విచారణ మొదలైంది. లెక్కలు కట్టి, దోపిడీ సొమ్మును వారి నుంచి కచ్చితంగా కక్కిస్తాం” అని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీ పర్యటనకు ముందు బేగంపేట ఎయిర్‌‌‌‌ పోర్ట్‌‌‌‌లో మీడియాతో భట్టి మాట్లాడారు. ‘‘ఏదో సాధించినట్లు, ఆ బావ, బావ మరిది కష్టపడి, చెమట చిందించి సంపాదించినట్లు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ స్వేదపత్రం అంటూ రిలీజ్‌‌‌‌ చేశారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. గత పాలకులు చేసిన అప్పుల్ని తీర్చాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాల్సిందే కదా. ఇందులో వాళ్ల గొప్పతనం ఏముంది?’’ అని ప్రశ్నించారు. దశాబ్దం పాటు పరిపాలన చేసిన బీఆర్ఎస్ అడ్డగోలుగా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఆస్తులు సృష్టించామంటూ గొప్పగా సమర్థించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఎక్కడున్నాయి ఆస్తులు?

‘‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమా? కాదా? అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. తలసరి ఆదాయం పెంచామని గత పాలకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా, ధనవంతులు మరింత సంపన్నులుగా మారారు. బీఆర్ఎస్ నిజంగా ఆస్తులను సృష్టిస్తే మరి కండ్లకు కనిపించాలి కదా? రాష్ట్రంలో ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేశారా? కొత్తగా సర్వీసు సెక్టార్ ఏర్పాటు చేశారా? కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా తెచ్చారా? ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటిని 10 ఏండ్లు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారు. 1956 నుంచి 2013 వరకు తెలంగాణకు కేటాయించిన ఐదు లక్షల కోట్ల బడ్జెట్‌‌‌‌లో గత ప్రభుత్వాలు నాగార్జునసాగర్, జూరాల, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, దేవాదుల, కడెం, కోయిల సాగర్ ప్రాజెక్టులను నిర్మించాయి. సాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీహెచ్​ఈఎల్, ఈసీఐఎల్, బీడీఎల్ లాంటి పరిశ్రమలు నెలకొల్పడానికి  కావాల్సిన భూమి, కరెంటు, నీళ్లు తదితర సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఏర్పాటుకు నాటి పాలకులు దోహదపడ్డారు” అని వివరించారు. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌‌‌‌ గాంధీ చెప్పినట్లుగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కక్కిస్తామని, జ్యూడీషియల్ విచారణకు ఆదేశించామని తెలిపారు.