- కాంగ్రెస్ వస్తే చీకటే అన్నోళ్లు ఇప్పుడు కరెంట్ వైర్లు పట్టుకోండి: డిప్యూటీ సీఎం భట్టి
- ప్రపంచంతో పోటీ పడేలా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నం
- పరిగిలో రూ.1,000 కోట్లతో 9 విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన
పరిగి, వెలుగు: కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదన్నోళ్లు ఇప్పుడు కరెంట్ వైర్లు పట్టుకొని చూస్తే తెలుస్తుందని చెప్పారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగిలో రూ.1,000 కోట్లతో తొమ్మిది 33/11 కేవీ సబ్ స్టేషన్లతో పాటు 220 కేవీ సబ్ స్టేషన్(నజీరాబాద్ తాండ), 400 కేవీ సబ్ స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
33/11 గట్టుపల్లి, 33/11 గూడూరు, 33/11 నస్కల్, 33/11 జాఫర్ పల్లి, 33/11 గోవిందాపూర్, 33/11 కొత్తపల్లి, 33/11పడిగ్యాల్, 33/11 పెద్దవార్వాల్ సబ్ స్టేషన్లకు భట్టి విక్రమార్క, పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. పలు శాఖలకు సంబంధించి పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెల్లిస్తున్నామని చెప్పారు. సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,60,310 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకం కింద ఇస్తున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో 2,47,777 కుటుంబాలకు గాను 1,43,190 కుటుంబాలకు రూ.42 కోట్లతో ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 44,500 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. ప్రతి నెల గృహ జ్యోతి పథకం కింద రూ.2,830 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పరిగి నియోజవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్, బీజాపూర్ హైవేపై బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం..
ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్, బీజాపూర్ హైవే మంజూరైందని, గత ప్రభుత్వం ఈ హైవే నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ హైవేకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసులు గత నెల క్లియర్ చేయించామని, దీంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రూ.3 వేల కోట్లతో పరిగి ప్రాంతానికి నావేల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టి సాగు నీరు అందిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
