- ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గ్లోబల్ సమిట్‌ను డిసెంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మెగా సదస్సు నిర్వహణ వేదిక పరిశీలనలో భాగంగా ఆయన ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సదస్సులో తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాం. ఈ రెండో సంవత్సరం విజయాలతో పాటు, 2047 వరకు తెలంగాణ ఏ రకంగా ఉండబోతున్నది, ప్రపంచంతో పోటీపడే విధంగా ఉండటానికి ఏం చేయాలి అనే అంశాలతో కూడిన ‘2047 విజన్ డాక్యుమెంట్’ను సీఎం రేవంత్ రెడ్డితో సహా కేబినెట్ ప్రత్యేక నిర్ణయం మేరకు ప్రపంచానికి వివరించదలుచుకుంది’’ అని అన్నారు.
ఈ విజయాలను వివరిస్తూ, భవిష్యత్తును చాటి చెప్పేందుకే ఈ గ్లోబల్ సమిట్ వేదికగా ఉంటుందని తెలిపారు. గ్లోబల్ సమిట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని, ఇందుకు 100 ఎకరాల ఓపెన్ ప్లేస్ అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం, దుండిగల్ వంటి ప్రాంతాలను వేదికల కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన ఫెస్టివల్‌ను మించి ఈ గ్లోబల్ సమిట్‌ను అత్యంత పకడ్బందీగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
