3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం..ప్రపంచానికి తెలంగాణ సత్తా చాటేలా ‘విజన్ 2047’ డాక్యుమెంట్ : భట్టి విక్రమార్క

 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం..ప్రపంచానికి తెలంగాణ సత్తా చాటేలా ‘విజన్ 2047’ డాక్యుమెంట్ : భట్టి విక్రమార్క
  • వచ్చే నెల 8, 9న గ్లోబల్ సమిట్.. ప్రపంచ దిగ్గజ సీఈవోలకు ఆహ్వానం
  • ట్రిపుల్‌‌‌‌ ఆర్​ పూర్తయితే ఏ రాష్ట్రం మనతో పోటీపడలేదు
  • మహిళా సంఘాలకు రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చామని వెల్లడి
  • విజన్‌‌‌‌ డాక్యుమెంట్​రూపకల్పనపై అధికారులతో రివ్యూ

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చాటిచెప్పేలా ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047’ ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాభవన్‌‌‌‌లోని వార్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌లో అన్నిశాఖల ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీలు, కార్యదర్శులతో కలిసి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. 

ఇది సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కలల ప్రాజెక్ట్  అని, దీని రూపకల్పన బాధ్యతను  తనకు అప్పగించారని పేర్కొన్నారు. ఇందులో ఇండియన్‌‌‌‌ స్కూల్ ఆఫ్​ బిజినెస్‌‌‌‌ (ఐఎస్‌‌‌‌బీ) నిపుణులతోపాటు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.  2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్​బీతో అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు.

 ఇప్పటికే వివిధ శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి, వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఐఎస్‌‌‌‌బీ బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందని చెప్పారు.  వచ్చేనెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమిట్‌‌‌‌ జరగనుందని,  ప్రపంచ దిగ్గజ సీఈవోలకు ఆహ్వానం పలికామని తెలిపారు. తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంట్‌‌‌‌ను తుదిదశకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 

చరిత్రలో నిలిచిపోయే అంశం..

2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిసెంబరు 9తో ప్రజా ప్రభుత్వం రెండో సంవత్సరం పూర్తి చేసుకుంటున్నదని తెలిపారు. రెండేండ్లలో తాము ఏం చేశామని చెప్పడం కంటే కూడా భవిష్యత్తు తరాలకు మేలు చేకూరేలా ఏవిధమైన పునాదులు వేయబోతున్నామనేది, రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామనే విషయాలను ప్రపంచానికి విజయం డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నట్టు తెలిపారు. 

ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసు సెక్టార్లలో జీడీపీని పెంచి 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నాయకత్వంలోని కేబినెట్‌‌‌‌ ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించిందన్నారు. కొంతకాలంగా డిజైన్ డాక్యుమెంట్‌‌‌‌పై కసరత్తు జరుగుతున్నదని చెప్పారు. ప్రభుత్వం ఏ లక్ష్యాలతో ముందుకెళ్తుందో వాటికి అధికారులంతా నిబద్ధతతో పనిచేశారని, వారికి అభినందనలు  తెలుపుతున్నానని అన్నారు. 

ట్రిపుల్​ ఆర్​ పూర్తయితే తిరుగుండదు..

రూ.36 వేల కోట్లతో చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడలేదని భట్టి విక్రమార్క  పేర్కొన్నారు. ఔటర్​ రింగ్​ రోడ్, రీజినల్​ రింగ్​ రోడ్​ మధ్య 39 రేడియల్ రోడ్లు, వాటిని అనుసంధానిస్తూ భారీగా ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పడతాయన్నారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. వాటిని అంది పుచ్చుకొని ప్రణాళికలు రూపొందించుకునేందుకు అన్నిశాఖల కార్యదర్శులు ఐఎస్‌‌‌‌బీ నిపుణులతో సమన్వయం చేసుకుంటూ విజన్ డాక్యుమెంట్‌‌‌‌లో పొందుపరచాలని సూచించారు. ఫార్మా, ఐటీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నదని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని ఇన్వెస్టర్లకు వివరించాలన్నారు.

13 శాతం జీడీపీని చేరుకోబోతున్నం..

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 13 శాతం జీడీపీ లక్ష్యసాధనలో ప్రతీశాఖ పాత్ర ఉండాలని, జీడీపీ 11 శాతం నుంచి 13 శాతానికి ఒకేసారి పెరగడానికి అధికారులు ఆలోచించి బలమైన డాక్యుమెంట్ రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం ఆయా శాఖల కార్యదర్శులు, మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్‌‌‌‌ను తుది దశకు తీసుకురావాలని, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేసి ఆమోదం తెలియజేస్తారని వివరించారు.

 రూ. 85 వేల కోట్లతో చేపడుతున్న రోడ్ల పనులు పూర్తయితే.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని,  దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేసినట్టు చెప్పారు.  ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని  అధికారులకు వివరించారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.