హైదరాబాద్‌లో బేగంపేట-సర్దార్ పటేల్ రోడ్డు ఎప్పుడూ ట్రాఫిక్ తో చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి బేగంపేట, ప్రకాష్‌నగర్ మీదుగా రసూల్‌పురా జంక్షన్ వరకు వాహనాలు స్పీడ్‌గా వెళ్లేందుకు, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ లేదా మినిస్టర్ రోడ్డు వైపు వెళ్లే వారికి మేలు జరిగేలా GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) రెండు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
ఆ రెండు ప్రాజెక్టులు ఏంటంటే: ఒకటి 150 కోట్లతో Y-ఆకారపు ఫ్లైఓవర్. ఇది రసూల్‌పురా దగ్గర మెట్రో రైల్ ఆఫీస్ (HMRL) పక్కన కడతారు. ఇది సుమారు 850 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక సైడ్ మినిస్టర్ రోడ్ వైపు(మూడు లేన్లు), మరొ సైడ్ పాటిగడ్డ వైపు(రెండు లేన్లు) వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ మీద వాహనాలు ఒకే దిశలో (One Way) వెళ్లేలా ప్లాన్ చేశారు.
మరొకటి 108.02 కోట్లతో పాటిగడ్డ రోడ్ ఓవర్ బ్రిడ్జి - RoB : ఈ బ్రిడ్జి పైగహ్ ప్యాలెస్(Paigah Palace) వద్ద మొదలై పి.వి. నరసింహారావు మార్గ్ వరకు కలుపుతుంది. పి.వి. నరసింహారావు మార్గ్, జేమ్స్ స్ట్రీట్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా మధ్య ట్రాఫిక్ తేలికగా మారడానికి ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైనది.
స్థానికులకు డబుల్ బోనాంజా: ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఆ ప్రాంతంలోని బేగంపేట, రసూల్‌పురా, ప్రకాష్‌నగర్, వల్లభ్‌నగర్, ఎయిర్‌లైన్స్ కాలనీ, పాటిగడ్డ, సర్దార్ పటేల్ రోడ్, వికార్ నగర్ ప్రజలకు చాలా మేలు జరుగుతుందని, వారి చిరకాల కోరిక తీరుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
GHMC అధికారులు చెప్పిన దాని ప్రకారం, ఈ పనుల వల్ల ఆ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గుతుంది, అలాగే పాటిగడ్డ రోడ్డును 100 అడుగులకు విస్తరిస్తారు. దీనివల్ల ఆర్.బి.ఐ క్వార్టర్స్ నుంచి సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ దాటి పి.వి. నరసింహారావు మార్గ్ వైపు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ సామర్థ్యం పెరుగుతుంది. గత పదేళ్లలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందడం వల్ల ట్రాఫిక్ పెరిగింది, అందుకే ట్రాఫిక్ తగ్గించడానికి GHMC ఈ ప్రాజెక్టులను ప్లాన్ చేసింది.
