IND vs SA: గిల్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్.. జట్టుతో పాటు గౌహతికి పయనం

IND vs SA: గిల్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్.. జట్టుతో పాటు గౌహతికి పయనం

గౌహతి వేదికగా జరగబోయే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో మెడ నొప్పితో ఇబ్బంది పడిన గిల్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. కోల్ కతా హాస్పిటల్ లో చేరిన ఈ టీమిండియా కెప్టెన్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. డాక్టర్లు మూడు నుంచి నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమని సూచించారు. గిల్ రెండో టెస్ట్ ఆడతాడా లేదా అనే విషయం పక్కన పెడితే భారత జట్టుతో పాటు బుధవారం (నవంబర్ 19) కోల్ కతా నుంచి గౌహతికి వెళ్లనున్నాడు. మ్యాచ్ కు ముందు రోజు గిల్ రెండో టెస్ట్ ఆడతాడో లేదో క్లారిటీ వస్తుంది. 

గిల్ గాయంపై తాజాగా బీసీసీఐ అప్ డేట్ ఇచ్చింది. " సౌతాఫ్రికాతో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో రెండో రోజు టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడకు గాయమైంది. ఆట ముగిసిన తర్వాత పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరిశీలనలో ఉంచి మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. శుభమాన్ వేగంగా కోలుకుంటున్నాడు. నవంబర్ 19న జట్టుతో కలిసి గౌహతికి వెళ్లి అక్కడ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడు. రెండో టెస్టులో అతను ఆడతాడో లేదో త్వరలో నిర్ణయం తీసుకుంటాం". అని బీసీసీఐ ట్వీట్ ద్వారా గిల్ గాయంపై సమాచారం తెలిపింది. 

గౌహతి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. గౌహతి టెస్టులో గెలిస్తేనే ఇండియా సిరీస్ సమం చేసుకుంటుంది. లేకపోతే 0-2 తేడాతో సిరీస్ కోల్పోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వెనకపడుతుంది. ఒకవేళ గిల్ దూరమైతే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియాను నడిపించనున్నాడు. అదే జరిగితే కెప్టెన్ గా పంత్ కు ఇదే తొలి టెస్ట్. గిల్ స్థానంలో సాయి సుదర్శన్ లేదా పడికల్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశముంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పడికల్, సుదర్శన్ లతో చాలాసేపు మాట్లాడాడు. 

►ALSO READ | RCB కొనుగోలు రేసులో కాంతారా, KGF నిర్మాత : కర్నాటక బ్రాండ్ దిశగా అడుగులు