ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు “అమ్మకానికి” వచ్చినట్లు సోషల్ మీడియాలో గంటగంటకూ చర్చ హీటెక్కుతోంది. ఈ క్రమంలో కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ ఫ్రాంచైజీకి కొనబోతుందనే ప్రచారం హల్‌చల్ సృష్టిస్తోంది. ఫ్యాన్ ఎడిట్లు, పోస్టర్లతో పాటు.. హోంబలే ఆర్సీబీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చాయి.
ఇది కేవలం ఊహాగానమేనని తెలుస్తోంది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ “రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్” పై తన పెట్టుబడుల సమీక్షను ప్రారంభించినట్లు నవంబర్ 5న స్టాక్ ఎక్స్చేంజ్‌లో ప్రకటించింది. ఆ సమీక్ష మార్చ్ 31, 2026లోపు పూర్తవుతుంది. దాని తరువాతే అమ్మకం, పునర్వ్యవస్థీకరణ లేదా యాజమాన్య మార్పులపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే హోంబాలే పేరు ఫ్రేమ్‌లోకి రెండు విధాలుగా ప్రవేశించింది. ఒకటి అభిమానులచే సృష్టించబడిన ఉత్సాహం, భారీగా షేర్ చేయబడిన "హోంబాలే RCB" పోస్టర్ల వల్లనేనని తెలుస్తోంది. ఇక రెండోది వారి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు.
2023 నుంచి హోంబలే ఆర్సీబీకి అధికారిక డిజిటల్ కంటెంట్ భాగస్వామిగా ఉంది. ఫ్రాంచైజీ అడ్వర్టైజ్మెంట్ వీడియాలు, సోషల్ మీడియా వీడియోలను వీరే రూపొందిస్తున్నారు. దీంతో హోంబలే సంస్థ ఐపీఎల్ జట్టును కొనబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2012లో బెంగళూరులో హోంబలే ఫిల్మ్స్ సంస్థను విజయ్ కిరగందూర్, చలువే గౌడ స్థాపించారు. మెుదట కన్నడ సినిమాలపై దృష్టిపెట్టిన సంస్థ ఆ తర్వాత కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా మూవీలతో ఫేమస్ అయ్యింది. భారీ బడ్జెట్‌లు, జాతీయ మార్కెట్, దూకుడు వ్యాపార వైఖరితో దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆర్సీబీ కొనుగోలు విషయం ఊహాగానంగానే తెలుస్తోంది. అలాగే తాజా అంచనాల ప్రకారం ఆర్సీబీ విలువ దాదాపు17వేల కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఇంత పెద్ద ఒప్పందానికి ఇన్వెస్ట్మెంట్ కన్సార్టియంలు, ప్రైవేట్ ఈక్విటీ, దశలవారీ పెట్టుబడులు తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎటువంటి టర్మ్‌షీట్ లీక్ కాలేదు. పైగా రెండు సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు. “హోంబలే ఆర్సీబీని కొనేసింది” అనేది ఇప్పటికీ నిర్ధారించని ఊహాగానమేనని తేలిపోయింది.
