Rajamouli-MaheshBabu: 'వారణాసి' టైటిల్ వివాదంలో రాజమౌళి.. మహేష్ బాబు సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిన మరో నిర్మాత!

Rajamouli-MaheshBabu: 'వారణాసి' టైటిల్ వివాదంలో రాజమౌళి.. మహేష్ బాబు సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిన మరో నిర్మాత!

దర్శకదీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం "వారణాసి" (Varanasi) . ఈ చిత్రంలో ప్రియంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందిస్తున్న ఈ మూవీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ ఈవెంట్ లో  "వారణాసి" టైటిల్ ప్రకటించనడంపై  ఇప్పుడు టైటిల్ హక్కుల వివాదం నెలకొంది. ఈ టైటిల్ తమ వద్ద ఇప్పటికే రిజిస్టర్ అయి ఉందని మరో నిర్మాణ సంస్థ క్లెయిమ్ చేస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు టైటిల్ సమస్య రావడం సినీ వర్గాల్లో గందరగోళానికి దారి తీసింది.

TFPC రికార్డుల్లో ఏముంది?

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) రికార్డుల ప్రకారం.. 'వారణాసి' (Vaaranasi) అనే టైటిల్ 2023 నుంచే నిర్మాత సిహెచ్. సుబ్బారెడ్డికి చెందిన రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పేరిట నమోదై ఉంది. అంతేకాకుండా ఈ నిర్మాణ సంస్థ ఆ టైటిల్‌ను 2025 జూన్ 24 నుండి 2026 జూలై 23 వరకు మరో ఏడాదికి రెన్యూవల్ కూడా చేసుకుంది. అయితే రాజమౌళి టీమ్ 'Varanasi' అని స్పెల్లింగ్ వాడినా, సుబ్బారెడ్డి బృందం మాత్రం  ఆ పేరు ఉచ్చారణ ఒక్కటే కాబట్టి, తమకే ఈ టైటిల్ హక్కులు ఉంటాయని గట్టిగా చెబుతోంది. సాధారణంగా వేర్వేరు స్పెల్లింగ్‌లు చర్చలకు అవకాశం ఇచ్చినప్పటికీ, అగ్ర నిర్మాణ సంస్థలు ఒకే ఉచ్చారణ ఉన్న టైటిళ్లను క్లెయిమ్ చేసినప్పుడు ఇటువంటి వివాదాలు సర్వసాధారణంగా తలెత్తుతాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి నిర్మాణ సంస్థ కౌన్సిల్‌ను అధికారికంగా ఆశ్రయించిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 టైటిల్ తేలకపోతే కౌన్సిల్ జోక్యం తప్పదా?

 ఈ టైటిల్‌పై రెండు వర్గాలు పట్టు వీడకపోతే.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రంగంలోకి దిగాల్సి ఉంటుందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  ఈ టైటిల్ హక్కులు ఎవరికి చెందుతాయో తేల్చాల్సి ఉంటుంది. రాజమౌళి, ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ ఇద్దరూ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సుబ్బారెడ్డితో సమావేశం అవుతారా, లేదా న్యాయపరమైన మార్గాన్ని అనుసరిస్తారా అనేది చూడాల్సి ఉంది. 

 ఆంజనేయుడిపై వ్యాఖ్యల వివాదం..

'వారణాసి' టైటిల్ వివాదం ఒకవైపు ఉండగానే.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు మరో పెద్ద వివాదానికి దారితీశాయి. సినిమా లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఆంజనేయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొన్ని హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. వనరసేన, గౌరక్షక్ సంఘ్ వంటి సంస్థలు సరూర్‌నగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాయి. రాజమౌళి ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవతలను అవమానించారని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఏది ఏమైనా, రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమా చుట్టూ ప్రారంభంలోనే ఇంతటి వివాదాలు చుట్టుముట్టడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 వేసవిలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టైటిల్ సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలి అభిమానులు కోరుతున్నారు.