ప్రస్తుతం మార్కెట్లో రియల్ ఎస్టేట్, స్టాక్స్, ఫండ్స్.. ఇలా ఏదీ సరైన బిజినెస్ చేయడం లేదు.. ఏడాదిలో డబుల్ రిటర్న్స్ ఇచ్చి కాసులు కురిపించింది ఒక్క బంగారమే. సామాన్యునికి అందనంత ఎత్తులో కూర్చుంది. బంగారానికి ఉన్న డిమాండ్ ఆధారంగా కొందరు వ్యాపారస్తులు, మోసగాళ్లు తెలివిగా మోసం చేస్తూ ఎస్కేప్ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో సంపాదించాలంటే ఇదే ఏకైక మార్గం అన్నట్లుగా మోసాలకు పాల్పడుతున్నారు.
లేటెస్టుగా వికారాబాద్ జిల్లాలో కూడా ఒక వ్యాపారి.. రూ.2 కోట్ల విలువైన బంగారంతో ఎస్కేప్ అయిన ఘటన సంచలనంగా మారింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో నరేందర్ చౌదరి అనే జువెలరీ షాపు యజమాని ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజయ్ జువెలరీ పేరుతో కొన్నేళ్లుగా బంగారు నగల షాపు నిర్వహించి స్థానికులను నమ్మించి నట్టేటా ముంచి ఉడాయించాడు.
నగలు చేయిస్తా అని కొందరి వద్ద, నగలు తనఖా పెట్టుకుని మరి కొందరి దగ్గర డబ్బులు, నగలు తీసుకుని బోర్డు తిప్పేశాడు. రఘు అనే యువకుడు నగల కోసం తన పాత బంగారం తోపాటు కొన్ని డబ్బులు కూడా ఇవ్వగా... గత నాలుగు రోజులుగా షాపు తెరవకుండా, ఫోన్ కూడా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నగల వ్యాపారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ నుంచి వచ్చి..
వ్యాపారి మోసంపై ఇప్పటికే 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... మరో వంద మంది బాధితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం కలిపి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసి ఉడాయించాడని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సదరు నగల వ్యాపారి రాజస్థాన్ కు చెందిన వాడని, స్థానికుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని మోసానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని తెలిపారు.
