హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. పరిపాలనలో ఇందిరా గాంధీ ఒక రోల్ మోడల్ అని ఆయన కొనియాడారు. బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని సీఎం రేవంత్ చెప్పారు.
భూ సంస్కరణలతో పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తుచేశారు. పాకిస్తాన్ను విడగొట్టి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదని సీఎం రేవంత్ తెలిపారు. ఇందిరా గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్నామని, మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లను చేశామని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ పాలన దేశానికి దిక్సూచి అని సీఎం రేవంత్ కొనియాడారు.
వైఎస్ఆర్ హయంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందని సీఎం విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేస్తామని, డిసెంబర్ 9 వరకూ ఇంటింటికీ చీరల పంపిణీ కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మార్చి ఫస్ట్ నుంచి 8 వరకూ రెండో విడతలో చీరల పంపిణీ ఉంటుందని, రెండో విడతలో 35 లక్షల చీరలను పట్టణాల్లో పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
