న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో పాఠశాలల్లో ఔట్‌డోర్ గేమ్స్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు స్కూల్స్ ఉత్తర్వులు జారీ చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) కు స్పష్టం చేసింది. వాయు కాలుష్యంపై అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడానికి నెలవారీ విచారణ జరపాలని నిర్ణయించింది.
ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై దాఖలైన పిటిషన్ ను బుధవారం మరోసారి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా... పొల్యూషన్ గరిష్ట స్థాయికి చేరినప్పటికీ... నవంబర్, డిసెంబర్ నెలల్లో స్కూల్స్ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాయని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ రిపోర్ట్ సమర్పించారు. ‘ఇది స్కూల్‌కు వెళ్లే పిల్లలను గ్యాస్ ఛాంబర్ లో పెట్టడం లాంటిదే’ అని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొన్న సీజేఐ.. తాజాగా ఆటలు ఆపేయాలని ఆదేశించారు.
