- పిస్తా హౌస్, షాగౌస్, మెహెఫిల్‌లో సోదాలు కంటిన్యూ
- భారీగా నగదు, బంగారం స్వాధీనం
- వర్కర్ల పేర్లతో బినామీ ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని పిస్తా హౌస్, షాగౌస్, మెహెఫిల్ బిర్యానీ హోటల్స్, రెస్టారెంట్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున మొదలైన సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ కాలనీలోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇండ్లతో పాటు షాగౌస్, మెహెఫిల్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇండ్లలో ఐటీ తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల సెర్చ్ వారెంట్‌తో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
లక్డీకపూల్, షేక్‌పేట్, అత్తాపూర్, టోలీచౌకి, గచ్చిబౌలి సహా గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 30 ప్రాంతాల్లో రెండ్రోజులుగా జరుగుతున్న ఈ సోదాల్లో.. రూ.కోట్లల్లో నగదు, భారీగా బంగారం పట్టుబడినట్లు తెలిసింది. వర్కర్ల పేర్లతో ఉన్న బినామీ ఆస్తుల డాక్యుమెంట్లు సహా కీలక పత్రాలు, పలువురి పేరున బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు సహా ఇతర వివరాలను ఐటీ అధికారికంగా వెల్లడించలేదు. బ్లాక్ మనీని హవాలా రూపంలో దారి మళ్లించినట్లు గుర్తించినట్లు సమాచారం. వీటికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్టు తెలిసింది. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
