న్యూఢిల్లీ: అధికార బీజేపీతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ‘ఓట్ చోరీ’కి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై దేశంలోని 272 మంది ప్రముఖులు స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ ను విమర్శిస్తూ 16 మంది రిటైర్డ్ జడ్జీలు, 123 మాజీ బ్యూరోకాట్స్, 133 మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, 14 మంది మాజీ అంబాసిడర్లు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లెటర్ రాశారు. ఓట్ చోరీ అంటూ ఈసీపై పదేపదే ఆధారాలు లేని ఆరోపణలు చేయటం ముమ్మాటికీ కాంగ్రెస్ తన రాజకీయ అసంతృప్తిని వెళ్లగక్కడమేనని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం, దాని పునాది సంస్థలపై దాడులు పెరుగుతుండటంపై సమాజంలోని సీనియర్ పౌరులమైన తాము ఆందోళనకు గురవుతున్నామన్నారు. ఎన్నికల్లో విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులు రాజకీయ వ్యూహాల కోసం ఈసీపై ఆధారాలులేని ఆరోపణలు చేయటమేంటని మండిపడ్డారు.
