- 23 ఏండ్లలో1,500 కేసులు.. 543 కేసులకు పరిష్కారం
- ప్రత్యేక టాస్క్ ఫోర్స్, నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రణాళిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన, వివాదాల్లో ఉన్న ఆలయ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేవుడి మాన్యాలను కాపాడేందుకు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సచివాలయంలో ఎండోమెంట్ ప్రభుత్వ న్యాయవాదులతో సమావేశమై, కేసుల పురోగతిపై ఆరా తీశారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన మార్గాలపై మేధోమథనం చేస్తున్నారు.
కాగా, అన్యాక్రాంతమైన ఆలయ భూములు, కేసుల వివరాలు, వాటి పురోగతిపై మంత్రి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అదనపు కమిషనర్లు కృష్ణప్రసాద్, కృష్ణవేణి, దేవాదాయశాఖ గవర్నమెంటు ప్లీడర్(జీపీ) బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరుల నుంచి తెలుసుకున్నారు.
పెండింగ్ కేసులే సవాల్
ప్రస్తుతం దేవాదాయ శాఖకు సంబంధించిన కేసులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. 2002 నుంచి 2025 వరకు దాదాపు 1,500 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే కాల వ్యవధిలో 543 కోర్టు కేసులను పరిష్కరించినట్లు దేవాదాయ శాఖకు నివేదిక అందింది. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసు దాఖలైన దగ్గరి నుంచి తుది తీర్పు వచ్చేవరకు పకడ్బందీగా వ్యవహరించేలా అధికారులకు, లీగల్ టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కీలకంగా న్యాయ విభాగం
ఆలయ భూముల పరిరక్షణలో న్యాయ విభాగం (లీగల్ టీం) పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తున్నది. ట్రస్టీలకు సంబంధించిన కేసులు, భూముల అన్యాక్రాంతం వంటి వ్యవహారాల్లో గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. అవసరమైతే పురావస్తు శాఖ (ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్) నుంచి వివరాలు సేకరించి, వాటిని కోర్టులో బలమైన సాక్ష్యాలుగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. దైవచింతన, సామాజిక స్పృహ కలిగిన నిపుణులతో ఒక ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
టాస్క్‌ఫోర్స్‌తో చెక్
కోర్టు కేసుల్లో ఇంటరిమ్ ఆర్డర్లు (మధ్యంతర ఉత్తర్వులు), కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కేసులు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సరైన సమయంలో ఉన్నతాధికారులను అప్రమత్తం చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధిగమించేందుకు పటిష్టమైన మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సివిల్ సప్లై విభాగం తరహాలో ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తున్నది. ఈ టాస్క్‌ఫోర్స్ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు కోర్టుల్లో కౌంటర్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం జరగకుండా చూస్తున్నది.
