రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి తుమ్మల ఫైర్

రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి తుమ్మల ఫైర్

ఖమ్మం, వెలుగు: పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న రాజకీయం దిగజారుడుగా ఉందన్నారు. ఖమ్మంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిన్నింగ్  మిల్లుల సమ్మెకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. ఒక వైపు పత్తి ఎంత ఉన్నా కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ప్రకటనలు చేస్తుంటే, సీసీఐ కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

ఎల్ 1, ఎల్ 2 విధానంతో పాటు, ఎకరానికి 7 క్వింటాళ్లే కొంటామని చెప్పడం, మొంథా తుఫాను కారణంగా తేమ శాతంపై సడలింపులు ఇవ్వాలని కోరితే స్పందించకపోవడం వంటి కొర్రీలను రైతులు గమనిస్తున్నారన్నారు. పత్తి కొనుగోళ్లు మొదలయ్యాక కపాస్  కిసాన్​ యాప్​ పెట్టారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మేధావి కావొచ్చు.. కానీ, రైతాంగాన్ని అవమాన పరచొద్దు అని హితవు పలికారు. యూరియా సరఫరాలో సాకులు చెప్పి రైతులని బజారులో నిలబెట్టిన బీజేపీ లీడర్లు, ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు.

పామాయిల్, పత్తిపై దిగుమతి సుంకం ఎత్తి వేశారన్నారు. సీసీఐ నిబంధనలు మార్చి పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్  చేశారు. ఎలక్షన్లలో కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బీఆర్ఎస్​ నేతల బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ఏనాడూ రైతుల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు బీఆర్ఎస్​ పెద్దలు తమ ఇంట్లో కుంపటిని రాష్ట్రమంతా పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. మార్కెట్లలో తిరుగుతూ రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్​ కుట్రలు చేస్తోందన్నారు.

యూరియా సరఫరాలో, పత్తి కొనుగోళ్లలో కేంద్రం తప్పిదానికి రేవంత్  ప్రభుత్వంపై బీఆర్ఎస్​ విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎంఎస్పీకి పంటలు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఒక్క ఏడాదిలోనే రైతుల కోసం రూ.1.06 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్​  చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.