పంట దెబ్బతిని రైతు ఆత్మహత్య.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో ఘటన

పంట దెబ్బతిని రైతు ఆత్మహత్య.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో ఘటన

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: పంట దెబ్బతినడంతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన రిక్కల శ్రీనివాస్ రెడ్డి(63) తన ఐదు ఎకరాల్లో వరి సాగు చేయగా, మొంథా తుఫాన్  ప్రభావంతో పంట పూర్తిగా నేలరాలడంతో నష్టపోయాడు. మనస్తాపానికి గురై ఈ నెల 13న గడ్డి మందు తాగాడు.

కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని హుస్నాబాద్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం హైదరాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతుడి కొడుకు సాయి కిరణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.

అనారోగ్యంతో ఫారెస్ట్​ బీట్ ఆఫీసర్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం ఫారెస్ట్​ రేంజ్​ పరిధిలోని బందగరినగరం బీట్​ ఆఫీసర్​ మాలోత్​ తులసీరాం(37) ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తులసీరాం​నాలుగు రోజుల కింద గడ్డి మందు తాగాడు. 

అతడిని చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.