- 5 మున్సిపాలిటీలో స్వతంత్రులే కీలకం
- చైర్పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్
- క్యాంపు రాజకీయాలు
సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సంగారెడ్డి జిల్లాలో ఉత్కంఠతను రేపుతున్నాయి. జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 5 చోట్ల సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ బీఆర్ఎస్ ఒకచోట మాత్రమే జెండా పాతింది. మిగిలిన 5 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కోహిర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం బల్దియాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెప్పుకోదగ్గ స్థానాలు దక్కలేదు.
జహీరాబాద్, కోహిర్, జిన్నారం మున్సిపాలిటీలో నువ్వా నేనా అన్నట్టు ఆ రెండు పార్టీలు సీట్లు దక్కించుకున్నప్పటికీ ఆయా బల్దియాల్లో స్వతంత్రులు గెలుపొందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 16న పాలకవర్గాలు కొలువుదీరనున్న క్రమంలో చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎంపిక కీలకంగా మారింది. ఇక్కడ పాలసీలకు విరుద్ధంగా పొత్తులు కుదిరే అవకాశాలు లేకపోలేదు.
దాంతో పార్టీల వారీగా గెలుపొందిన కౌన్సిలర్లతోపాటు స్వతంత్రులను సైతం క్యాంపు రాజకీయాలకు తరలించారు. కొన్నిచోట్ల కౌంటింగ్ కేంద్రాల నుంచే గెలిచిన కౌన్సిలర్లను స్పెషల్ బస్సుల్లో తరలించారు. మరికొన్నిచోట్ల శుక్రవారం రాత్రి స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీలు, ఎంపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పటాన్చెరు నియోజకవర్గంలో మూడు చోట్ల హంగ్ ఏర్పడగా, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఒకచోటే అఫీషియో సభ్యుడిగా ఓటు వేసే చాన్స్ దీంతో స్వతంత్రుల ఓట్లే కీలకంగా మారనున్నాయి.
