మెదక్ జిల్లాలో చైర్మన్ పదవి పై కన్ను

మెదక్ జిల్లాలో  చైర్మన్ పదవి పై కన్ను
  •     నేతల ప్రసన్నానికి ప్రయత్నాలు
  •     క్యాంపులో బీఆర్ఎస్ కౌన్సిలర్లు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని నాలుగు మున్సిపల్ చైర్​పర్సన్​పదవుల్లో గజ్వేల్, దుబ్బాక మున్సిపాల్టీలు బీసీ మహిళ, హుస్నాబాద్ ఎస్సీ జనరల్, చేర్యాల ఎస్సీ మహిళకు రిజర్వ్​ చేశారు. గెలుపొందిన ఆయా వర్గాలకు చెందిన నేతలు ఇప్పుడు చైర్​పర్సన్​ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎస్సీ జనరల్ రిజర్వ్ అయిన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించిన కాంగ్రెస్ అభ్యర్థి కేడం లింగమూర్తి అనూహ్యంగా ఓడిపోవడంతో దండి లక్ష్మికి అవకాశం దక్కనుంది. దుబ్బాకలో  బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన బండి శ్రీలత, శ్రీరాం సంగీత చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. ఇక్కడ చైర్​ పర్సన్​ పదవి లభిస్తుందని భావించిన వడ్ల కొండ సుభద్ర అనూహ్యంగా ఓడిపోవడంతో బండి శ్రీలత, శ్రీరాం సంగీత  పేర్లు తెరపైకి వచ్చాయి. 

ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన చేర్యాల మున్సిపాలిటీ చైర్​పర్సన్​పదవి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ముస్త్యాల అరుణకు లభిస్తుందని భావించినా చివరి నిమిషంలో రెండో వార్డు నుంచి గెలుపొందిన గీతాంజలితో పోటీ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన గజ్వేల్ చైర్ పర్సన్ పదవికి కల్యాణ్కర్ పద్మాబాయి, గంగిశెట్టి చందన పేర్లు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలవగానే గజ్వేల్, దుబ్బాక, చేర్యాల  మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు క్యాంపులకు వెళ్లారు. ఈనెల 16న చైర్​ పర్సన్​ ఎన్నిక జరిగే దగ్గరకు నేరుగా రానున్నారు. క్యాంపులోనే చైర్ పర్సన్ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి.