భారత్‌‌‌‌ను ఆరాధించేవాళ్లంతా హిందువులే.. వాళ్లు క్రిస్టియన్లా, ముస్లింలా అనేది ముఖ్యం కాదు:భాగవత్‌‌‌‌

భారత్‌‌‌‌ను ఆరాధించేవాళ్లంతా హిందువులే.. వాళ్లు క్రిస్టియన్లా, ముస్లింలా అనేది ముఖ్యం కాదు:భాగవత్‌‌‌‌

గువాహటి(అస్సాం): మన దేశాన్ని ఆరాధించే వాళ్లు క్రిస్టియన్స్ అయినా, ముస్లింలు అయినా వారంతా హిందువులేనని ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మోహన్‌‌‌‌  భాగవత్‌‌‌‌ అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ల మత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ, మన పూర్వీకులను గర్వకారణంగా భావించే వాళ్లంతా హిందువులేనని చెప్పారు. 

జన్మనిచ్చిన భూమి పట్ల ఆరాధన భావం కలిగి ఉన్న వారు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ వారు హిందువులేనని స్పష్టంచేశారు. హిందుత్వ అంటే కేవలం మతం అనే అర్థంలో మాత్రమే చూడొద్దని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అస్సాంలో రచయితలు, మేధావులు, వ్యాపారవేత్తలతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.

 ‘‘మాతృభూమి పట్ల భక్తి, పూర్వీకుల పట్ల గౌరవం, భారత సంస్కృతి.. వారసత్వాన్ని కొనసాగించేవాళ్లంతా హిందువులే. హిందూ ధర్మం, హిందూ సంస్కృతి అంటే కేవలం ఆహార విధానాలు, ఆరాధన మాత్రమే కాదు. ఇది అందరినీ కలుపుకుపోయే విశాలమైన ఆలోచనా విధానం” అని మోహన్‌‌‌‌ భాగవత్‌‌‌‌ పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన పంచ పరివర్తన్‌‌‌‌ గురించి వివరించారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.  పూర్వీకుల కథలు చెప్పి పిల్లలు, యువకుల్లో దేశ సాంస్కృతిక గౌరవాన్ని పెంచాలన్నారు. సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, క్రమశిక్షణ కూడా చాలా మఖ్యం అని సూచించారు. ఈశాన్య భారతం మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా నిలుస్తుందని కొనియాడారు.