హైదరాబాద్, వెలుగు: సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లుగా రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన 45 మంది తెలంగాణ వ్యక్తులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రతినిధి బృందం సౌదీ అధికారులతో 24 గంటలూ సమన్వయంతో పని చేస్తోందని వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మేరకు సహాయక చర్యల నిమిత్తం మంత్రి అజారుద్దీన్‌తో పాటు అధికారులు బి. షఫియుల్లా, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌లతో కూడిన ప్రభుత్వ బృందం సౌదీకి చేరుకుంది. సోమవారం రాత్రి సౌదీకి చేరుకున్న మంత్రి బృందం మదీనాలోనే ఉంటూ జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి, సౌదీలోని సీనియర్ అధికారులతో సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నది. రియాద్‌లో ఉన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్‌ను కూడా కలిసింది.
మంత్రి అజారుద్దీన్ సౌదీ అరేబియాలో తనకున్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి అన్ని లాంఛనాలు, అనుమతులు, లాజిస్టికల్ అవసరాలు ఆలస్యం లేకుండా వేగవంతం చేస్తున్నారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయెబ్ కుటుంబ సభ్యుడిని కూడా కలిశారు. అతనికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి మదీనాకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులను మంత్రి రిసీవ్ చేసుకున్నారు. వారి ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అంతే కాకుండా మృతదేహాల గుర్తింపు, డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియను కూడా సులభతరం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్మాట్లాడుతూ.. ‘సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడానికి సౌదీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. సౌదీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్లుగా చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
