అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: మంత్రి అడ్లూరి

అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: మంత్రి అడ్లూరి
  • ఉద్యమంలో ముందుండి కొట్లాడిన సామాన్యుడు: మంత్రి అడ్లూరి 
  • ఘట్కేసర్​లో అందెశ్రీ సంతాప సభ
  • హాజరైన ఆర్ ​నారాయణమూర్తి, కవులు, కళాకారులు, గాయకులు

ఘట్కేసర్, వెలుగు: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ లోని డీజీఆర్ కన్వెన్షన్ హాలులో అందెశ్రీ సంతాప సభ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ ముందుండి కొట్లాడిన కూడా ఓ సామాన్యుడిలా జీవితాన్ని గడిపారని తెలిపారు. ఏనాడూ ఆడంబరానికి పోలేదని పేర్కొన్నారు. 

అనంతరం సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. అందెశ్రీ తమ విప్లవ సినిమాలకు కూడా ఎంతో సహకారం అందించారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి దహన సంస్కారాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రావడం.. అందెశ్రీ పాడే మోసి అన్ని కార్యక్రమాలు ముందుండి నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం  రేవంత్​కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఒక కవి, కళాకారుడు చనిపోతే ఇంతకంటే గౌరవం అక్కర్లేదని ఆయన కొనియాడారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్, అయోధ్యరెడ్డి, కోదండరాం, మిట్టపల్లి సురేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, విమలక్క, పిట్టల శ్రీశైలం, బూడిద సుధాకర్ సహా పలువురు కవులు, రచయితలు, అందెశ్రీతో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు.

అందెశ్రీ రచనలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని.. ఆయన ఆశయాలను కొనసాగించడం సమాజం బాధ్యత అన్ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, పన్నాల కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ నిర్మల గానం బృందం అందెశ్రీ రచించిన మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు అనే భావోద్వేగభరిత గేయాన్ని ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.