- వృద్ధులకు జపాన్, ఇటలీ తరహాలో వైద్య సేవలందాలి
- అనారోగ్యంతో ఉన్న వృద్ధుల లిస్ట్ రెడీ చేయండి
- వైద్య శాఖపై డీఎంహెచ్వోలతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా దృష్ట్యా వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రతి టీచింగ్, జిల్లా హాస్పిటల్స్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా 20 బెడ్లతో ‘జెరియాట్రిక్ వార్డు’ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు చైల్డ్ కేర్ సెంటర్లు ఉన్నట్టే.. వృద్ధులకు కూడా స్పెషల్ కేర్ సెంటర్లు ఉండాలన్నారు. ఈ మేరకు జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జపాన్, ఇటలీ తరహాలో మన దగ్గర కూడా వృద్ధులకు వైద్య సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల జాబితాను జిల్లా వైద్యాధికారులు సిద్ధం చేసి వారికి ఫ్రీగా వైద్యం అందేలా చూడాలన్నారు.
అటెండెన్స్ మానిటర్ చేస్తున్నం
హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరకొర బిల్డింగులు కట్టి చేతులు దులుపుకున్నదని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ‘‘ఇప్పటి దాకా మేం 9 వేల పోస్టులు భర్తీ చేసినం. మరో 7 వేల పోస్టులు భర్తీ అవుతున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక పేషెంట్లకు సేవ చేయడం మీ చేతుల్లోనే ఉంది. డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్ల అటెండెన్స్ ను మేం పర్సనల్‌గా మానిటర్ చేస్తున్నం. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. బాగా పనిచేసే వారికి అండగా ఉంటాం.. తప్పుడు వార్తలు రాయించే వారితో కఠినంగా ఉంటాం’’ అని మంత్రి హెచ్చరించారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని సహించొద్దు
వైద్యం పేరుతో జనాన్ని దోచుకునే ప్రైవేట్ హాస్పిటళ్లతో కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ‘‘ఐవీఎఫ్ సెంటర్లు, పెయిన్ క్లినిక్ లు, రిహాబిలిటేషన్ సెంటర్ల పేరిట అక్రమాలకు పాల్పడితే సహించొద్దు. పోలీసులను చూస్తే దొంగలు భయపడినట్టు.. వైద్యాధికారులను చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ భయపడేలా క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు చేయాలి. అనవసర సిజేరియన్లు చేసే హాస్పిటల్స్ పై నిఘా పెట్టాలి’’ అని మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ కు రిఫర్ చేయొద్దని చెప్పారు. ‘‘అవసరమైతే మరో ప్రభుత్వ హాస్పిటల్స్ రిఫర్ చేయాలి తప్ప.. ప్రైవేట్‌కు పంపొద్దు. సబ్ సెంటర్ నుంచి జీజీహెచ్ వరకు అన్ని హాస్పిటల్స్ మధ్య కో ఆర్డినేషన్ ఉండాలి’’ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
